Ravi Shastri on Rohit Sharma: టీమ్ఇండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ అనవసర విషయాలకు స్పందించే వ్యక్తి కాదని మాజీ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. జట్టుకు ఏది అవసరమో అదే చేస్తూ అతడు ముందుకు సాగుతాడని పేర్కొన్నాడు. రోహిత్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంపై ఆనందం వ్యక్తం చేసిన రవిశాస్త్రి అతడికి పలు సూచనలు చేశాడు.
"రోహిత్ అనవసర విషయాలకు స్పందించడు. పరిస్థితులను బట్టి జట్టుకు ఏది అవసరమో అదే చేస్తూ ముందుకు సాగుతాడు. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిని సమర్థంగా ఉపయోగించుకుంటేనే విజయవంతమైన నాయకుడిగా రాణించగలుగుతాడు" అని రవిశాస్త్రి సూచించాడు.
Ravi Shastri on Virat Kohli: అలాగే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై కూడా రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. "కోహ్లీ సమర్థవంతమైన ఆటగాడే. కానీ, అతడు సాధించిన రికార్డులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కెప్టెన్‌గా అతడు సాధించిన విజయాల ఆధారంగానే గౌరవిస్తుంటాం. టీమ్ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం అనేది మామూలు విషయం కాదు. కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన విజయాల పట్ల గర్వపడాలి. వ్యూహాత్మకంగా అతడు గొప్ప కెప్టెన్" అని రవిశాస్త్రి అన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన నాయకుడిగా పేరు పొందిన రోహిత్ శర్మకు.. అంతర్జాతీయ క్రికెట్లోనూ కెప్టెన్‌గా మెరుగైన రికార్డే ఉంది. ఇప్పటి వరకు 32 మ్యాచ్‌లకు తాత్కాలిక సారథిగా వ్యవహరించిన అతడు.. 26 మ్యాచుల్లో విజయం సాధించాడు. రోహిత్ సారథ్యంలోనే భారత్.. నిదాహస్ ట్రోఫీ, 2018లో ఆసియా కప్ విజేతగా నిలిచింది.