Ravi Shastri On Bumrah: గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌నకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అవకాశం దక్కించుకొనే ఆటగాడు ఎవరా..? అనేది చర్చనీయాంశం. కొందరేమో మహమ్మద్ షమీని ప్రధాన జట్టులోకి తీసుకోవాలని చెబుతుండగా.. దీపక్ చాహర్ అయితే మంచి ఆప్షన్ అవుతాడని మరికొందరు పేర్కొన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఉన్నారు. కానీ, ఆసీస్ పిచ్‌లపై సిరాజ్ అద్భుతంగా పేస్ రాబడతాడని వాదించేవారూ లేకపోలేదు. టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ మాత్రం ఇంకా అధికారికంగా ఏ ఆటగాడి పేరును వెల్లడించలేదు. మరోవైపు రవీంద్ర జడేజా కూడా ఇప్పటికే మెగా టోర్నీ నుంచి దూరమయ్యాడు. ఈ క్రమంలో కీలకమైన ఆటగాళ్లను భారత్ మిస్ కావడంపై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి విశ్లేషించాడు. బుమ్రాకి బదులు వచ్చే బౌలర్‌పై చాలా ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నాడు.
"మరికొన్ని రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో పేసర్ బుమ్రా గాయం కారణంగా దూరం కావడం దురదృష్టకరం. అయితే, ఇది మరొక ఆటగాడికి మంచి అవకాశం దొరికినట్లే. ఇప్పటికీ టీమ్‌ఇండియాకు తగినంత బలం ఉంది. మంచి జట్టుతోనే బరిలోకి దిగబోతున్నాం. తప్పకుండా సెమీస్‌కు చేరుకొంటామనే నమ్మకం నాకుంది. బుమ్రా, జడేజా లేరని ఏమాత్రం నిరాశం చెందాల్సిన అవసరం లేదు. కొత్త ఛాంపియన్‌గా మారేందుకు మరో ఆటగాడికి చక్కని అవకాశం లభిస్తుంది. షమీకి అనుభవం అక్కరకొస్తుంది. ఆసీస్ పిచ్ పరిస్థితులకు నప్పుతాడు. గత ఆరేళ్లుగా టీమ్‌ఇండియా పర్యటనల్లో షమీ భాగమైన సంగతి తెలిసిందే. అందుకే అతడి అనుభవం ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నా" అని రవిశాస్త్రి వెల్లడించాడు. ఇప్పటికే టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. అక్టోబర్ 10, 13వ తేదీల్లో ప్రాక్టీస్ మ్యాచ్‌లతోపాటు.. ఆసీస్‌తో (అక్టోబర్ 17న), కివీస్‌తో (అక్టోబర్ 19న) వార్మప్ మ్యాచ్‌లను భారత్ ఆడనుంది. మెగా టోర్నీలో టీమ్‌ఇండియా తొలి సమరం అక్టోబర్ 23న పాక్‌తో జరగనుంది.