Ravi Shastri on IND vs AUS 36 All Out: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డేనైట్ టెస్టులో 36 పరుగులకే టీమ్‌ఇండియా కుప్పకూలడమే తన పదవీకాలంలో అత్యంత దారుణమైన ప్రదర్శన అని భారత జట్టు ప్రధాన కోచ్‌గా పదవీవిరమణ చేసిన రవిశాస్త్రి తెలిపాడు. ఈ సంఘటన తామందరిని షాక్‌కు గురి చేసిందని, దాంతో అందరం నిశ్చేష్టులయ్యామని చెప్పాడు. తన పదవీకాలంలో అత్యంత తక్కువస్థాయి ప్రదర్శన అని పేర్కొన్నాడు.
"కోచ్ అనేవాడు ఎప్పుడూ విమర్శలకు సిద్ధంగా ఉండాలి. తప్పించుకునే మార్గాలు ఉండవని తెలుసు. ఆ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించాం. కనీసం ఇంకో 80 పరుగులు చేస్తే గెలుపు కోసం పోరాడే అవకాశం ఉంది. అయితే కేవలం 36 పరుగులే చేశాం. దీంతో మేం ఒక్కసారిగా షాక్‌తో నిశ్చేష్టులయ్యాం. దీనికి నేనే మొదటి బాధ్యుడినని చెబుతా. తర్వాతి మ్యాచ్‌లకు సంబంధించి ఆటగాళ్లు ఏం చేయగలరో అదే చేయమని చెప్పా. దానిని ఆచరించి సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఎప్పటికీ ఆ సిరీస్ విజయం గురించి క్రికెట్ ప్రేమికులు మాట్లాడుకుంటారని ధీమాగా చెబుతున్నా."