Ravi Shastri On Bumrah : టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచ కప్ సమయానికి రెడీగా ఉంచాలని బీసీసీఐ ఆలోచిస్తున్న తీరును రవిశాస్త్రి తప్పుబట్టాడు. ఆగస్టులో ఐర్లాండ్‌తో జరిగే టీ20 మ్యాచ్‌లకు బుమ్రాను ఆగమేఘాలపై జట్టులోకి తీసుకొస్తే.. అతడు గాయపడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అలా జరిగితే భారత్‌కు తీవ్రనష్టం కలుగుతుందని తన అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో గతంలో పీసీబీ చేసిన తప్పును ప్రస్తావిస్తూ.. పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదీ జట్టుకు దూరమైన విషయాన్ని గుర్తు చేశాడు.
"ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచ కప్జరగనుంది. ఆ టోర్నీ కోసం ప్రాక్టీస్ అవుతుందన్న ఉద్దేశంతో బుమ్రాను జట్టులోకి తీసుకొస్తే.. మరోసారి గాయపడితే మళ్లీ నాలుగు నెలల పాటు అతడు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇది జట్టుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. గతంలో కూడా పాకిస్థాన్.. టీ-20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని బౌలర్ షహీన్ అఫ్రిదీ పూర్తిగా గాయం నుంచి కోలుకోకముందే జట్టులో ఆడించారు. బోర్డు తొందరపాటు నిర్ణయం వల్ల షహీన్ అఫ్రిదీ మళ్లీ నాలుగు నెలలు ఆటకు దూరమయ్యాడు. బుమ్రా ఓ అత్యుత్తమ పేస్ బౌలర్. అతడు టీమ్ఇండియాకు చాలా కీలకం. కానీ అతడిని ప్రపంచకప్ ప్రాక్టీస్ కోసమని ఇప్పుడు ఐర్లాండ్‌తో టీ 20ల్లో బరిలో దింపితే.. జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే మేనేజ్మెంట్ ఆలోచించి ముందుకెళ్లాలి."
-రవిశాస్త్రి టీమ్ఇండియా మాజీ కోచ్