IPL 2022 Ravishastri Kohli: బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీకి కొద్ది రోజులు విశ్రాంతి ఇవ్వాలని టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భారీ అంచనాలు, తీవ్ర ఒత్తిడి నడుమ అతడు చితికిపోతున్నాడని తెలిపాడు. తాజా సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన విరాట్ 19.83 పేలవ సగటుతో 119 పరుగులే చేశాడు. గతరాత్రి లఖ్‌నవూతో ఆడిన మ్యాచ్‌లో గోల్డన్ డకౌటయ్యాడు. దీంతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్‌కుముందు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న విరాట్.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడతాడని, భారీ పరుగులు చేస్తాడని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయినా ఇలా విఫలమవుతూ ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడాడు.
"ఆటగాళ్లు విఫలమైనప్పుడు వారిపట్ల సానుభూతితో ఉండాలి. వారిపై అనవసర ఒత్తిడి తెస్తే ప్రయోజనం ఉండదు. వాళ్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. నేనిక్కడ నేరుగా కోహ్లీ పేరే చెప్పదల్చుకున్నా. అతడిప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. టీమ్‌ఇండియాలో ఎవరికైనా విశ్రాంతినివ్వాలంటే అది కోహ్లీకి మాత్రమే. అది రెండు నెలలలైనా, నెలన్నర రోజులైనా ఫర్వాలేదు. అది కూడా ఇంగ్లాండ్ పర్యటనకు ముందు లేదా తర్వాత. అతడిలో ఇంకా 6-7 ఏళ్ల క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఇలా తీవ్రమైన ఒత్తిడి పరిస్థితుల్లో ఆడించి ఆటకు దూరం చేయకూడదు. అయితే, ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నది అతనొక్కడే కాదు. ప్రపంచ క్రికెట్‌లో ఒకరో ఇద్దరో ఉన్నారు. వారు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. దీంతో వాళ్లకున్న అసలు సమస్య ఏంటో గుర్తించాలి" అని శాస్త్రి పేర్కొన్నాడు.