Ravi Shastri Captaincy: టీమ్ఇండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలనే వాదనపై మాజీ కోచ్ రవిశాస్త్రి విభేదించాడు. కపిల్ దేవ్ లాంటి నిఖార్సైన ఆల్ రౌండర్‌కి టెస్టు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలికినప్పటి నుంచి తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ టీమ్‌ఇండియా కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకే టెస్టు పగ్గాలు కూడా అప్పగిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో బీసీసీఐ, జట్టు యాజమాన్యం భవిష్యత్ కెప్టెన్‌ను కూడా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
"బుమ్రాకు టెస్టు పగ్గాలు అప్పగించాలనడం సరికాదు. నాకెప్పుడూ అలాంటి ఆలోచనే రాలేదు. భారత జట్టులో పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. జట్టులో స్థానం కోసం ఎదురు చూసే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి, టీమ్‌ఇండియాలో ఫాస్ట్ బౌలర్ సుదీర్ఘ కాలం జట్టులో కొనసాగలేడు. అందుకే, ఒక పేసర్ కెప్టెన్‌గా వ్యవహరించడమనేది చాలా కష్టం. ఫాస్ట్ బౌలర్ కెప్టెన్‌గా ఉండాలంటే.. బ్యాటుతోనూ రాణించాల్సి ఉంటుంది. లేదంటే బాబ్ విల్లీస్‌లా ఎప్పుడూ జట్టులో ఉండే ఆటగాడైనా కావాలి. అలాంటి బౌలర్ భారత్‌తో దొరకడం చాలా అరుదు. ఇవేవీ కాకుంటే.. కపిల్ దేవ్, సర్ గార్‌ఫీల్డ్‌లా నిఖార్సైనా ఆల్ రౌండర్‌కు అయినా టీమ్‌ఇండియా టెస్టు పగ్గాలు అప్పగించాలి."
--రవిశాస్త్రి, మాజీ కోచ్.