తెలంగాణ

telangana

ETV Bharat / sports

రషీద్​ రికార్డ్​.. ఆ జాబితాలో రెండో స్థానం.. సూపర్​-4లో అఫ్గాన్​ - బంగ్లాదేశ్‌ మ్యాచ్​

Rashid Khan Vs Bangladesh : అంతర్జాతీయ టీ20లో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తుల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు అఫ్గానిస్థాన్​ స్పిన్నర్​​ రషీద్​ ఖాన్​. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్​లో అతను ఈ ఘనత సాధించాడు. స్పిన్నర్లు చెలరేగడంతో.. బంగ్లాదేశ్​ను చిత్తు చేసిన అఫ్గానిస్థాన్​ సూపర్​-4లో ప్రవేశించింది.

ASIA CUP RASHID
ASIA CUP RASHID

By

Published : Aug 31, 2022, 9:10 AM IST

Updated : Aug 31, 2022, 11:36 AM IST

Rashid Khan Vs Bangladesh : అంతర్జాతీయ టీ20లో అత్యధిక వికెట్ల తీసిన వ్యక్తుల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు అఫ్గానిస్థాన్​ స్పిన్నర్​​ రషీద్​ ఖాన్​. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్​లో అతను ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌​ ఇన్నింగ్స్​లోని 16వ ఓవర్​లో స్లాగ్ స్వీప్‌కు ప్రయత్నించి డీప్ మిడ్‌ వికెట్‌లో ఇబ్రహీం జద్రాన్‌ క్యాచ్ పట్టడంతో రషీద్ మహ్మదుల్లాను ఔట్ చేశాడు. ఈ వికెట్​తో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సౌథీని అధిగమించాడు రషీద్​. 68 టీ20లకు గాను రషీద్​ ఖాన్​ ఇప్పటివరకు 115 వికెట్లు తీసాడు. తొలి స్థానంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఆల్​రౌండర్​ షకిబ్​ అల్​ హసన్ 122 వికెట్లతో ఉన్నాడు. కివీస్​కు చెందిన టిమ్​ సౌథీ 114 వికెట్లు తీయగా, శ్రీలంకకు చెందిన లసిత్​ మలింగ 107, న్యూజిలాండ్​కు చెందిన ఇష్​ సోదీ 99 వికెట్లు తీశారు.

ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌ జోరు కొనసాగుతోంది. గ్రూప్‌-బి తొలి మ్యాచ్‌లో శ్రీలంకను మట్టికరిపించిన ఆ జట్టు.. బుధవారం బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. 128 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 18.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ముజీబ్‌ రెహ్మాన్‌ (3/16), రషీద్‌ ఖాన్‌ (3/22)ల విజృంభణతో బంగ్లా 127/7కు పరిమితమైంది. వీరి ధాటికి టాప్‌, మిడిలార్డర్‌ విలవిలలాడడంతో ఒక దశలో బంగ్లా 53/5తో నిలిచింది. ఈ స్థితిలో మహ్మదుల్లా (25)తో కలిసి మొసాడెక్‌ హొస్సేన్‌ (48 నాటౌట్‌; 31 బంతుల్లో 4×4, 1×6) గొప్పగా పోరాడాడు. దీంతో బంగ్లా పోరాడగలిగే స్కోరు సాధించింది.

అయితే లక్ష్యం చిన్నదే అయినా.. బంగ్లా తేలిగ్గా వదిలిపెట్టలేదు. స్పిన్నర్లను ఆడడం చాలా కష్టంగా మారిన పిచ్‌ను ఉపయోగించుకుంటూ షకిబ్‌ (1/13), మొసాడెక్‌ (1/12) కట్టుదిట్టంగా బంతులేయడంతో అఫ్గాన్‌ ఛేదన చాలా కష్టంగా సాగింది. గుర్బాజ్‌ (11)ను ఆరంభంలోనే షకిబ్‌ ఔట్‌ చేయగా.. నిలకడగా ఆడుతున్న హజ్రతుల్లా జజాయ్‌ (23)ను మొసాడెక్‌ పెవిలియన్‌ చేర్చాడు. నబి (8) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సాధించాల్సిన రన్‌రేట్‌ బాగా పెరిగిపోయి అఫ్గాన్‌ లక్ష్యానికి దూరమవుతున్నట్లు కనిపించింది. కానీ క్రీజులో కుదురుకున్నాక ఇబ్రహీం జద్రాన్‌ కొన్ని షాట్లు ఆడి ఒత్తిడి తగ్గించగా.. నజీబుల్లా ఒక్కసారిగా సిక్సర్ల మోత మోగిస్తూ మ్యాచ్‌ను అఫ్గాన్‌ చేతుల్లోకి తెచ్చేశాడు. బంగ్లా ప్రధాన బౌలర్‌ ముస్తాఫిజుర్‌ వేసిన 16వ ఓవర్లో రెండు మెరుపు సిక్సర్లు బాదడంతో రన్‌రేట్‌ అదుపులోకి వచ్చింది. సైఫుద్దీన్‌ వేసిన తర్వాతి ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో అతను మ్యాచ్‌ను ముగించాడు.

ఇదీ చదవండి:పసికూన హాంకాంగ్​తో భారత్​ ఢీ.. గెలిస్తే అగ్రస్థానంతో సూపర్​-4కు

బ్యాట్​ తగిలి మాజీ క్రికెటర్​ విలవిల, వీడియో వైరల్​

Last Updated : Aug 31, 2022, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details