Ranji Trophy Participation:భారత క్రికెట్ బోర్డు నియంత్రణ మండలి (బీసీసీఐ) డొమెస్టిక్ టోర్నీలకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా అడుగులు వేయనుంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో టీమ్ఇండియా ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో తమ సొంత రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడం తప్పనిసరి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు ఈటీవీ భారత్‌తో తెలిపారు.
'టీమ్ఇండియా ప్లేయర్లు ఇంటర్నేషనల్ సిరీస్‌లు, మ్యాచ్‌లు లేని సమయంలో అవకాశం ఉన్నప్పుడల్లా ఆయా ఆటాగాళ్లు తమ తమ రాష్ట్రాల తరఫున రంజీలో ఆడాల్సి ఉంటుంది. ఏ ప్లేయరైన సరైన కారణం లేకుండా రాష్ట్ర జట్టుకు ఆడకపోతే, జాతీయ జట్టు ఎంపికలో వారిని పరిగణలోకి తీసుకోం. ఫ్యూచర్లో ఒక ప్లేయర్ డొమెస్టిక్ లీగ్‌ల పెర్ఫార్మెన్స్ను దృష్టిలో ఉంచుకొనే టీమ్ఇండియాకు సెలెక్ట్ చేస్తాం. అప్పట్లో దిగ్గజ ఆటగాళ్లు సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ సైతం అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి రెస్ట్ ఉన్నప్పుడు రంజీ టోర్నీల్లో ఆడేవారు. మరి ఇప్పటి తరం ప్లేయర్లు ఎందుకు ఆడారు? అందుకే రంజీ ట్రోఫీలో కచ్చితంగా ఆడాల్సిందేనని చెబుతున్నాం' అని సెలెక్షన్ కమిటీ మెంబర్ చెప్పారు.
టీమ్ఇండియా ప్లేయర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు తమ రాష్ట్రాలకు ఆడే ఛాన్స్ ఉన్నప్పటికీ రంజీ ట్రోఫీని తేలిగ్గా తీసుకున్న క్రమంలో బీసీసీఐ ఈ నిబంధన తీసుకురానునుంది. అయితే 'అఫ్గానిస్థాన్ సిరీస్‌కు అయ్యర్, ఇషాన్‌ను ఈ కారణం వల్లే ఎంపిక చేయలేదా?' అన్న ప్రశ్నకు మాత్రం వారి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఇక జనవరి 11న భారత్- అఫ్గానిస్థాన్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు బీసీసీఐ 16 మందితో కూడిన జట్టును ఇటీవల ప్రకటించింది. అలాగే ఈ జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.