Ranji Trophy: తొలిసారి ట్రోఫీని ముద్దాడిన మధ్యప్రదేశ్ టీమ్
14:50 June 26
రంజీ ట్రోఫీ విజేతగా మధ్యప్రదేశ్
Ranji Trophy 2022 Winner: Ranji Trophy 2022 Winner: Ranji Trophy 2022 Winner: దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్ అద్భుత ప్రదర్శన చేసింది. ట్రోఫీని అందుకోవాలనే సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. 2022 సీజన్ విజేతగా నిలిచి.. తొలిసారి రంజీ ఛాంపియన్‌గా అవతరించింది. 1998-99 రంజీ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన మధ్యప్రదేశ్.. ముంబయితో జరిగిన ఫైనల్ పోరులో ఆద్యంతం అధిపత్యం చెలాయిస్తూ విజేతగా నిలిచింది. ఐదురోజుల పాటు సాగిన ఈ తుదిపోరులో 6వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో ముంబయి 374 పరుగులు చేయగా.. మధ్యప్రదేశ్ 536 రన్స్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో.. 113/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ముంబయి 269 పరుగులకు ఆలౌట్ అయింది. సువేద్ పార్కర్ 51 రన్స్‌తో టాప్ స్కోర్‌గా నిలవగా.. సర్ఫరాజ్ ఖాన్(45), పృథ్వీ షా(44) బాగా రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్ కుమార్ కార్తికేయ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. గౌరవ్ యాదవ్, పార్థ్ సహాని చెరో రెండు వికెట్లు తీశారు.అనంతరం 108 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ మంచి ప్రదర్శన చేసింది. హిమాన్షు మాంత్రి(37), తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరోలు శుభమ్ శర్మ(30), రజత్ పాటిదర్(30*) జట్టును విజయతీరాలకు చేర్చారు.
కెప్టెన్‌గా సాధించలేనిది కోచ్ పాత్రలో..మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో కోచ్ రవి చంద్రకాంత్ పండిత్ భావోద్వేగతంతో కన్నీటి పర్యంతమయ్యారు. 1999లో ఆయన మధ్యప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఇదే చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయారు. దాదాపు 23ఏళ్ల తర్వాత చంద్రకాంత్ కోచ్‌గా వ్యవహరించిన మధ్యప్రదేశ్ జట్టు ట్రోఫీని కైవసం చేసుకోవడంతో స్టేడియంలోనే భావోద్వేగానికి గురయ్యారు. మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.