Ranji Trophy 2022 Final: దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ 2022 సీజన్ తుది అంకానికి చేరుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ నెల 22న దేశవాళీ దిగ్గజం ముంబయి- మధ్యప్రదేశ్ మధ్య ఫైనల్ జరగనుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో 41 సార్లు ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి.. మరో టైటిల్‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల రికార్డులను ఓ సారి పరిశీలిద్దాం..
బలాలు.. ముంబయి బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. గత కొన్ని సీజన్ల నుంచి నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ ఈసారి ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ఆడిన ఐదు గేమ్స్‌లో 803 పరుగులు చేసి సీజన్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన యశస్వి జైశ్వాల్.. రంజీ ట్రోఫీలో రెండే మ్యాచులు ఆడి ఏకంగా 413 పరుగులు చేశాడు. అదీ కీలక క్వార్టర్ ఫైనల్లో ఓ సెంచరీ, సెమీఫైనల్లో రెండు సెంచరీలతో చెలరేగాడు. మరో అరంగేట్ర ఆటగాడు సువేద్ పార్కర్(252) తన తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బౌలర్లో షామ్స్ ములాని ఐదు మ్యాచుల్లో 37 వికెట్లు తీసి 292 పరుగులు చేయగా.. తనుష్ కొటియన్ 18 వికెట్లు తీసి, 236 రన్స్ చేశాడు. ఇక ఓపెనర్, దూకుడైన ప్లేయర్ పృథ్వీ షా, అర్మాన్ జాఫర్ కూడా బాగా ఆడుతున్నారు. కాబట్టి వీరంతా తుదిపోరులో రాణిస్తే.. 42వ టైటిల్‌ను ముంబయి ముద్దాడడం ఖాయమనే చెప్పాలి.
మధ్యప్రదేశ్ జట్టు కూడా ఈ మధ్య కాలంలో క్రమక్రమంగా బలంగా తయారవుతోంది. ఆ జట్టుకు కీలకంగా ఉన్న ఆల్రండర్ వెంకటేశ్ అయ్యర్, పేసర్ అవేశ్ ఖాన్ అందుబాటులో లేకపోవడం ఒక్కటే ప్రతికూలాంశం. బ్యాటింగ్‌లో హిమన్షు మంత్రి, అక్షత్ రఘువంశీ కూడా బాగా ఆడుతున్నారు. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున రజత్ పాటిదార్.. అద్భుతంగా రాణించాడు. వీరంతా ఫైనల్లో రాణిస్తే జట్టు గెలిచే అవకాశముంది.
మరోవైపు.. స్పిన్నర్లు కుమార్ కార్తికేయ, సారాన్ష్ జెయిన్ నిలకడైన ప్రదర్శన చేస్తున్నారు. ఐదు మ్యాచుల్లో 27 వికెట్లు తీసిన కార్తికేయ.. ఈ సీజన్లో ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
ముంబయి
- సెమీఫైనల్లో ఉత్తర్ప్రదేశ్పై పూర్తి ఆధిపత్యం చలాయించిన ముంబయి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో టోర్నీ చరిత్రలో 47వ సారి ఫైనల్‌కు అర్హత సాధించింది.
- ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ యశస్వి జైశ్వాల్ (100, 181) రెండు శతకాలు చేసి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.
- ముంబయికి ఇది 47వ ఫైనల్ అయినప్పటికీ గత ఐదేళ్లలో తుదిపోరుకు చేరడం ఇదే తొలిసారి.
- 41సార్లు టైటిల్స్‌ను అందుకుని 89.1 విజయశాతం నమోదు చేసింది. కేవలం ఐదు సార్లు మాత్రమే రన్నరప్‌గా నిలిచింది. రికార్డు స్థాయిలో 15 వరుస టైటిళ్లు సాధించిన రికార్డు ముంబయి పేరిట ఉంది.
- చివరిసారిగా 2015/16లో సౌరాష్ట్రపై గెలిచి సీజన్ విజేతగా నిలిచింది ముంబయి.
- క్వార్టర్ ఫైనల్లో ఏకంగా 725 పరుగులు భారీ తేడాతో గెలిచి 92ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్ర ఆటగాడు సువేద్ పార్కర్(252), సర్ఫరాజ్ ఖాన్(153), ఆకాశ్ మధ్వల్(108), జైస్వాల్(103) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు.
- ఈ సీజన్లో ఇప్పటివరకు ఎక్కువ పరుగులు 803 సర్ఫరాజ్ ఖాన్ చేయగా.. షామ్స్ ములాని 37 అత్యధిక వికెట్లు తీశాడు
మధ్యప్రదేశ్
- సెమీఫైనల్లో బెంగాల్‌పై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 174 పరుగుల తేడాతో గెలిచిన మధ్యప్రదేశ్.. 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తుదిపోరుకు వెళ్లింది.
- మధ్యప్రదేశ్ తొలిసారి 1998-99లో రంజీ ఫైనల్ ఆడి రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు మూడోసారి తుదిపోరు చేరింది.
- అప్పుడు ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న చంద్రకాంత్ పండిత్ ఇప్పుడు కోచ్‌గా వ్యవహరిస్తుండడం విశేషం.
- 1953లో చివరిసారిగా ట్రోఫీని ముద్దాడిన మధ్యప్రదేశ్.. అప్పటి నుంచి ఇప్పటివరకు టైటిల్‌ను దక్కించుకోలేదు.
- మధ్యప్రదేశ్ తరఫున ఈ సీజన్లో ఎక్కువ పరుగులు (480) యశ్ దుబే, కుమార్ కార్తికేయ ఎక్కువ వికెట్లు(27) తీశారు.
ఇదీ చూడండి: అశ్విన్‌కు కరోనా.. ఇంగ్లాండ్ టెస్టుకు ఆలస్యంగా పయనం