తెలంగాణ

telangana

ETV Bharat / sports

గల్లీ టూ రంజీ.. పేదింటి బిడ్డ క్రికెట్​ ప్రయాణం! - punnaiah cricket journey

మన దేశంలో క్రికెట్​కు ఉండే క్రేజే వేరు. క్రికెట్​ను చూడటానికే కాదు.. ఆడటానికి యువత ఎంతో ఇష్టపడతారు. గల్లీ క్రికెట్​ను కూడా ఎంతో శ్రద్ధగా.. చాలా సీరియస్​గా తీసుకుని ఆడుతుంటారు. అలా గల్లీలో మొదలుపెట్టి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్​కు చెందిన భువనగిరి పున్నయ్య కూడా ఈ జాబితాలోకే చేరనున్నాడు. సరదాగా గల్లీలో క్రికెట్ ఆడిన పున్నయ్య కఠోర శ్రమతో ప్రాక్టీస్​ చేసి రంజీ ట్రోఫీలో అదరగొట్టే స్థాయికి ఎదిగాడు. అతడి గురించే ఈ కథనం..

punnaiah hyderabad
ranji cricketer punnaiah

By

Published : Mar 1, 2022, 7:34 AM IST

మహ్మద్‌ సిరాజ్‌.. ఈ హైదరాబాద్‌ కుర్రాడి పేరు వినగానే అతడి నేపథ్యం గుర్తొస్తుంది! ఆటో నడిపే నాన్న గుర్తొస్తాడు! గల్లీ స్థాయి నుంచి టీమ్‌ఇండియా ప్రధాన బౌలర్లలో ఒకడిగా అంచెలంచెలుగా ఈ పేసర్‌ ఎదిగిన వైనం గుర్తొస్తుంది! ఇప్పుడు ఆ సిరాజ్‌ బాటలోనే మరో నగర కుర్రాడు వెళుతున్నాడు. పేద కుటుంబం నుంచి వచ్చి రంజీ తలుపు తట్టి భవిష్యత్‌ దిశగా దూసుకెళ్తున్నాడు. అతడే భువనగిరి పున్నయ్య. హైదరాబాద్‌ యువ పేసర్‌. పేద కుటుంబం నుంచి ఎదిగిన అతడు తాజాగా రంజీ అరంగేట్రం చేశాడు.

కుటుంబ నేపథ్యమిది..

కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డుకు చెందిన పున్నయ్యది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. నాన్న ఆంజనేయులు రిక్షా నడిపితే.. తల్లి పోలమ్మ ఇళ్లలో పని చేసేది. చిన్న గుడిసెలోనే వారి జీవనం. ఇలాంటి స్థితి నుంచి వచ్చిన 18 ఏళ్ల పున్నయ్య రంజీ స్థాయికి ఎదగడమే పెద్ద విశేషం. అయిదో తరగతిలో ఉన్నప్పుడు భువన విజయం మైదానంలో సరదాగా టెన్నిస్‌ బంతితో ఆడడం మొదలుపెట్టిన పున్నయ్య పేస్‌ బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకునేవాడు. కోచ్‌ నరేశ్‌ ప్రోత్సాహంతో వేగంతో పాటు క్రమశిక్షణగా బంతులేయడాన్ని అతడు నేర్చుకున్నాడు. అతడిలో నైపుణ్యాన్ని గుర్తించిన మాజీ క్రికెటర్‌ చాముండేశ్వరీనాథ్‌ ఆర్థికంగా ఆదుకుని.. మెరుగైన క్రికెటర్‌ అయ్యేందుకు సహకరించాడు.

కెరీర్​లో మలుపు..

హైటెక్‌ సిటీలోని రామానాయుడు క్రికెట్‌ అకాడమీలో ప్రాక్టీస్‌ చేసే అవకాశం రావడం అతడి కెరీర్‌లో మలుపు. ఇక్కడే అతడు తోలు బంతితో ఆడడం ప్రాక్టీస్‌ చేసి నెమ్మదిగా పట్టు సంపాదించాడు. ఆపై హెచ్‌సీఏ శిబిరాల్లో సత్తా చాటిన అతడు లీగ్స్‌లోనూ ఎంపీ కోల్ట్స్‌ జట్టు తరఫున రాణించాడు. 2019లో హైదరాబాద్‌ అండర్‌-19 రాష్ట్ర జట్టుకు ఆడే అవకాశాన్ని దక్కించుకున్న పున్నయ్య ముంబయిపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. అదే టోర్నీలో కేరళపైనా అయిదు వికెట్లతో విజృంభించాడు. ఆ తర్వాత 2020లో కూచ్‌బెహర్‌ టోర్నీలో త్రిపురపై 5 వికెట్లు సహా 20 వికెట్లతో అదరగొట్టాడు. ఈ ప్రదర్శనలతో ఆ సంవత్సరం అతడికి జాతీయ క్రికెట్‌ అకాడమీ నుంచి పిలుపొచ్చింది. కానీ కొవిడ్‌-19 కారణంగా ఎన్‌సీఏ అవకాశాన్ని పున్నయ్య కోల్పోయాడు. కొవిడ్‌ విరామం తర్వాత 2021లో అహ్మదాబాద్‌లో జరిగిన ఛాలెంజర్‌ టోర్నీలో భారత్‌-బి జట్టుకు ఆడే ఛాన్స్‌ ఈ పేసర్‌కు వచ్చింది. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు పడగొట్టిన పున్నయ్య ఈ ఏడాది రంజీల్లో ఆడే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.

అరంగేట్రంలోనే..

ఫిబ్రవరి 24న కటక్‌లో బెంగాల్‌పై రంజీ ట్రోఫీ అరంగేట్రం చేసిన పున్నయ్య ఆరంభంలోనే ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో టాప్‌ఆర్డర్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టిన ఈ బౌలర్‌ రెండో ఇన్నింగ్స్‌లో మరో వికెట్‌ తీశాడు. కూచ్‌ బెహర్‌ ట్రోఫీ, అండర్‌-19 విభాగంలో ఇండియా ఛాలెంజర్స్‌ ట్రోఫీ, సీకే నాయుడు ట్రోఫీల్లో అయిదేసి వికెట్ల ప్రదర్శనలతో సత్తా చాటాడు. భువనేశ్వర్‌, రబాడాలను ఆరాధించే ఈ కుడి చేతి వాటం పేసర్‌కు ఔట్‌ స్వింగర్‌ ప్రధానాస్త్రం. ‘‘రంజీలో ఆడడం సంతోషంగా ఉంది. కష్టపడినందుకు ఫలితం దక్కింది. నాకు అవకాశం కల్పించిన హెచ్‌సీఏ నమ్మకాన్ని వమ్ము చేయను. భారత్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నది నా కల’’ అని పున్నయ్య చెప్పాడు.

ఇదీ చదవండి: 'ఆ దిగ్గజ బ్యాటర్​ను అప్పట్లో రెండు, మూడు సార్లు బౌల్డ్‌ చేశా'

ABOUT THE AUTHOR

...view details