పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మెన్ రమీజ్ రాజాపై వేటు పడింది. సొంతగడ్డపై ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభావాన్ని(వైట్‌వాష్) ఎదుర్కొన్న నేపథ్యంలో పీసీబీ చైర్మెన్ బాధ్యతల నుంచి రమీజ్ రాజాను తప్పిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14 మంది సభ్యులతో కూడిన మరి కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ.. కొత్త చైర్మన్‌గా నజమ్ సేథిని నియమించింది. ఈ నూతన ఛైర్మన్ నజమ్ సేథి నియామకాన్ని పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ఆమోదించినట్లు పాక్ మీడియా పేర్కొంది.
17 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోసం పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్.. తన అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ సిరీస్‌లో పాకిస్థాన్ ఆట తీరు కన్నా మ్యాచ్‌లకు ఉపయోగించిన పిచ్‌లపైనే తీవ్ర విమర్శలు వచ్చాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే రమీజ్ రాజా.. పీసీబీ ఛైర్మన్‌గా జట్టుకు చేసింది ఏం లేదని, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌కు సరైన పిచ్‌లను కూడా ఏర్పాటు చేయించలేకపోయాడని విమర్శలను మూటగట్టుకున్నాడు.