Rajvardhan Hangargekar News: ఈ ఏడాది జరిగిన పురుషుల అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత బౌలర్ రాజవర్ధన్ హంగర్గేకర్. ఇటీవల ఐపీఎల్ వేలంలోనూ బంపర్ఆఫర్ కొట్టేశాడు. చెన్నై జట్టు రూ. కోటిన్నర వెచ్చించి ఇతడిని జట్టులోకి తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ ఆటగాడు చిక్కుల్లో పడ్డాడు.
అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియాకు ఆడిన హంగర్గేకర్.. వయసు తగ్గించి చూపాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అండర్-19లో ఆడేందుకు బీసీసీఐకి తన వయసును తక్కువగా చూపించుకున్నట్లు స్పోర్ట్స్ అండ్ యూత్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఓం ప్రకాశ్ బకోరియా ఆరోపించారు. ఈ విషయాన్ని ఓ వార్తా పత్రిక వెల్లడించింది. ఈ మేరకు ఓంప్రకాశ్ బీసీసీఐకి లేఖ కూడా రాసినట్లు పేర్కొంది.
అతని వయసు 21 ఏళ్లు..
హంగర్గేకర్ ప్రస్తుత వయసు 21 ఏళ్లు అని.. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నట్లు ఓంప్రకాశ్ తన లేఖలో పేర్కొన్నారు. హంగర్గేకర్.. ధారాశివ్‌లోని తెర్నా పబ్లిక్ స్లూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశాడని ఓం ప్రకాశ్ తెలిపారు. ఆ పాఠశాల రికార్డుల ప్రకారం హంగర్గేకర్ పుట్టినతేదీ 2001 జనవరి 10గా ఉందని.. అయితే ఎనిమిదో తరగతికి వచ్చాక హంగర్గేకర్ తన పుట్టినతేదీ వివరాలను మార్చుకున్నాడని ఆరోపించారు. ఆ తేదీని 2002 నవంబరు 10గా మార్పించుకున్నాడని లేఖలో పేర్కొన్నారు.