Rahul Dravid World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ప్లేయర్లు దూసుకెళ్తున్నారు. ఆడిన 7 మ్యాచుల్లోనూ అత్యధిక స్కోర్ సాధించి ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంటూ సెమీస్‌లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో నేడు (నవంబర్ 5)న దక్షిణాఫ్రికాతో రోహిత్ సేన తలపడనుంది. అయితే.. గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న టీమ్‌ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఈ ప్రపంచకప్ టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు అతడి స్థానంలో యంగ్ ప్లేయర్ ప్రసిద్ధ్ కృష్టను జట్టులోకి తీసుకున్నట్లు తాజాగా బీసీసీఐ వెల్లడించింది. ఇక ఈ విషయంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు. అతడి ఎంపికకు గల కారణాలను మీడియాకు వివరించాడు. టీమ్‌ఇండియా పేస్ బౌలింగ్ స్క్వాడ్‌ను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.
"ఇది మంచి ఆలోచన. మేం ముగ్గురు ఫాస్టబౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్లో ఆడాం. 15 మందితో కూడిన జట్టులో మాకు స్పిన్ బ్యాకప్(అశ్విన్) కూడా ఉంది. అలాగే ఆల్‌రౌండర్(శార్దూల్ ఠాకూర్) బ్యాకప్ కూడా మాకు ఉంది. అయితే.. ఫాస్ట్ బౌలింగ్ మాత్రం బ్యాకప్ లేదు. దీంతో ఎవరైనా అనారోగ్యం బారిన పడ్డా, గాయపడ్డా.. అందుకోసం బ్యాకప్ అవసరమని మేం గుర్తించాం. ఇది ఇతర కాంబినేషన్లతో ఆడేందుకు మాకు ఉపయోగపడుతుందని నా భావన" అని ద్రవిడ్ వివరించాడు.
ఇక ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పటి వరకు 17 వన్డేలు ఆడి అందులో 29 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ ఆడాడు. అయితే ఇప్పుడున్న టీమ్‌ఇండియా పేస్ త్రయంలో బుమ్రా, షమి, సిరాజ్ అదరగొడుతున్నారు. ఈ క్రమంలో వీరిలో ఎవరికైనా గాయమైతే తప్ప ప్రసిద్ధ్‌కి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.