Rahul Dravid Son Cricket : టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ కర్ణాటక అండర్-19 జట్టులోకి మెంబర్‌గా ఎంపికయ్యాడు. త్వరలో జరగనున్న వినూ మన్కడ్ ట్రోఫీ నేపథ్యంలో కర్ణాటక జట్టులోకి ఎంపికైన 15 మంది సభ్యుల్లో ఈ 17 ఏళ్ల యంగ్ ప్లేయర్ భాగమయ్యాడు. ధీరజ్ గౌడ నాయకత్వం వహిస్తున్న ఈ జట్టుకు, ధృవ్ ప్రభాకర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. హర్షిల్ ధర్మాని, యువరాజ్ అరోరా కూడా వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. హైదరాబాద్ వేదికగా వినూ మన్కడ్ టోర్నీ అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. అట్టహాసంగా జరగనున్న ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న జరగనుంది.
Rahul Dravid Son Anvay Dravid : ద్రవిడ్ రెండో తనయుడు అన్వయ్ కూడా క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నాడు. రెండేళ్ల క్రితం అండర్-14 ఇంటర్ జోనల్ టోర్నీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన అన్వయ్.. అన్నయ్య సమిత్‌తో కలిసి మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరి మెప్పు పొందాడు. అలా బీటీఆర్ షీల్డ్ అండర్ 14 స్కూల్ టోర్నమెంట్‌లో ఈ ఇద్దరూ డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి రికార్డుకెక్కారు. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన అన్వయ్ ద్రవిడ్.. 90 పరుగులు చేసి శతకానికి చేరువయ్యాడు. మరోవైపు ఈ ఏడాది జనవరిలో జరిగిన U-14 ఇంటర్ జోనల్ టోర్నమెంట్‌లో అన్వయ్ ద్రవిడ్ కర్ణాటక U-14 జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అంతకుముందు 2019-20 ఇంటర్-జోనల్ మ్యాచ్‌లలో అతను 2 డబుల్ సెంచరీలు సాధించాడు.