Rahul Dravid: టీమ్‌ఇండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ తన ఆటకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశాడు. తన ఆలోచనా విధానాన్ని క్రికెట్ నుంచి తప్పిస్తే మానసికంగా ఎలా ఉపయోగపడిందో వివరించాడు. తానెప్పటికీ మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్‌లా ఉండలేనని చెప్పాడు.
"ఒక్కసారి నా కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటే.. దీర్ఘకాలం నేను క్రికెట్‌లో కొనసాగడానికి, అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి నేను మానసికంగా దృఢంగా ఉండటమే అసలైన కారణం. నేను క్రికెట్ ఆడనప్పుడు కూడా నా ఆట గురించి, ఎలా ఆడాలనే విషయాల గురించి అతిగా ఆలోచించేవాడిని. దీంతో నేను నా మానసిక శక్తిని అనవసరంగా వృథా చేసేవాడిని. అయితే, ఒకానొక సమయంలో అలా ఆలోచించడం వల్ల నాకు ఏమాత్రం ఉపయోగం లేదని గ్రహించా. అది నా ప్రదర్శనను కూడా మెరుగుపర్చడం లేదని గుర్తించా. దీంతో ఏదైనా కొత్తగా ప్రయత్నించి రీఫ్రెష్ అవ్వాలని నిర్ణయించుకున్నా. ఆ సమయంలోనే క్రికెట్‌కు మించిన కొత్త జీవితాన్ని కనుగొన్నా" అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.