Rahul Dravid on Kohli: జోహెనస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు సిద్ధమవుతోంది టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో భారత జట్టు టెస్టు సారథి విరాట్ కోహ్లీపై పలు వ్యాఖ్యలు చేశాడు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్. 20 రోజులకు పైగా కోహ్లీ కెప్టెన్సీ అంశంపై చర్చలు జరుగుతున్నా.. అతడు అద్భుతంగా వ్యవహరించాడని అన్నాడు.
"గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అంశంపై చర్చ జరుగుతోంది. అయినా అతడు బాగా రాణించాడు. జట్టు సభ్యులతో మునుపటిలానే ఉన్నాడు. ఇన్ని చర్చల నడుమ ఆటకోసం తను సిద్ధమైన విధానం అద్భుతం."
--రాహుల్ ద్రవిడ్, టీమ్ హెడ్ కోచ్.
దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీ ఇప్పటివరకూ మీడియా ముందు హాజరుకాలేదు. దీనిపై స్పందించిన ద్రవిడ్.. కోహ్లీ అలా చేయడానికి ప్రత్యేక కారణమేమీ లేదని తెలిపాడు. బహుశా కోహ్లీ తన 100వ టెస్టు సందర్భంగా మీడియా ముందుకు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.
దక్షిణాఫ్రికా 3వ టెస్టు కోహ్లీ 100వ టెస్టు కానుంది. ఈ మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా జనవరి 11న ప్రారంభంకానుంది.