టీమ్‌ఇండియా 'మిస్టర్ 360' ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.. తనదైన స్టైల్‌లో సునామీ సృష్టిస్తే ఎలా ఉంటుందో తాజాగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వీక్షించాం. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకొంది. హార్దిక్-రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో టీమ్‌ఇండియా కొత్త ఏడాదిని అద్భుతంగా ప్రారంభించింది. సూపర్ సెంచరీతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికైన సూర్యకుమార్‌ను మ్యాచ్ అనంతరం ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే ద్రవిడ్ ఎంతో సరదాగా సూర్యను ప్రశ్నలు అడగడంతో అభిమానులు ఫిదా అయ్యారు. ఇంటర్వ్యూకి సంబంధించిన టీజర్‌ను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్ చేసింది.
సూర్యకుమార్‌ను పరిచయం చేస్తూ.. ఇక్కడ మన దగ్గర ఉన్న బ్యాటర్ మీకు తెలుసు.. అయితే కుర్రాడిగా ఉన్నప్పుడు నా బ్యాటింగ్‌ను చూడనివారిలో అతడు కూడా ఉంటాడు (నవ్వుతూ).. అని ద్రవిడ్ అనగా.. ద్రవిడ్ ప్రశ్నకు సూర్యకుమార్ కూడా నవ్వుతూ.. 'నేను చూశాను' అని సమాధానం ఇచ్చాడు. అయితే ద్రవిడ్ కలగజేసుకొని "నువ్వు చూసి ఉండవనే నేను అనుకుంటున్నా. అందులో ఎలాంటి సందేహం లేదు" అని సరదాగా వ్యాఖ్యానించాడు.
ఇంటర్వ్యూ సాగిందిలా..
ద్రవిడ్:
ప్రతి మ్యాచ్ తర్వాత ఇంతకంటే అద్భుతమైన టీ20 ఇన్నింగ్స్‌ను చూడలేమోనని అనుకొనేవాడిని. అయితే నీ సూపర్ ప్రదర్శనతో మరిచిపోయేలా చేశావు. గత ఏడాది కాలంలో ప్రత్యక్షంగా నీ ఆటను చూడటం గర్వంగా భావిస్తా. ఇప్పటి వరకు ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఉత్తమమైనది ఎంచుకోమంటే .. దేనిని సెలెక్ట్ చేసుకుంటావు?
సూర్య:
క్లిష్ట పరిస్థితుల్లో ఆడటం నాకెంతో ఇష్టం. అయితే నేను ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఒకదానిని ఎంచుకోవడమంటే కొంచెం కష్టమే. బ్యాటింగ్‌ను చేయడాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తా. బ్యాటింగ్‌కు దిగినప్పుడు నేనేం చేయగలనో అదే సంతోషంగా చేసేందుకు ప్రయత్నిస్తా.
ద్రవిడ్:
విభిన్న షాట్లను కొట్టే క్రమంలో ముందే అలాంటివాటిని అంచనా వేసి ఆడతావా..? లేకపోతే పరిస్థితిని బట్టి అంచనాకు వస్తావా..?
సూర్య:
టీ20 ఫార్మాట్‌లో ముందే కొంచెం అంచనా వేయాలి. అదే సమయంలో ఇతర షాట్లను ఆడాలి. అలాగే బౌలర్ ఎలా వేస్తాడు అనేదానిని కాస్త ముందుగా గ్రహించి షాట్లు కొట్టేందుకు ప్రయత్నిస్తా. మూడో టీ20 మ్యాచ్‌లో వెనుకవైపు బౌండరీ లైన్ తక్కువగా ఉందనిపించింది. అందుకే అటువైపు బంతిని పంపించేందుకు షాట్లు కొట్టా. ఎక్కువగా ఫీల్డర్ల మధ్య ఖాళీ ప్రాంతాలను గుర్తించి కొడతా. ఫీల్డింగ్‌ను బట్టి కాస్త అడ్వాంటేజ్ తీసుకొంటా.