Rachin Ravindra World Cup : రచిన్ రవీంద్ర.. వరల్డ్ కప్‌లో ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతోంది. భారత సంతతికి చెందిన ఈ న్యూజిలాండ్ ప్లేయర్.. మైదానంలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి.. 23 ఏళ్ల వయసులోనే ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. తన తండ్రి పెట్టిన పేరుకు తగ్గట్టుగా రాహుల్ ద్రవిడ్, సచిన్ లాగా ఆడి చరిత్ర సృష్టిస్తున్నాడు. తన అరంగేట్ర ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటి వరకు మూడు శతకాలు బాది సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. దీంతో రానున్న కాలంలో ఇతను స్టార్ క్రికెటర్‌గా ఎదగడంలో ఎటువంటి సందేహం లేదని క్రికెట్ మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రచిన్ నానమ్మ- తాతయ్యలు ( పూర్ణిమ, బాలకృష్ణ) ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. తాజాగా చిన్నస్వామి స్టేడియం వేదికగా పాకిస్థాన్- న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు వారు అక్కడికి వచ్చారు. తన నానమ్మ - తాతయ్య స్టాండ్స్‌లోంచి చూస్తుండగా రచిన్ శతకం పూర్తి చేశాడు. ఈ సందర్భంగా రచిన్ తాతయ్య తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇండియాతో జరిగే ఫైనల్స్‌లో తన మనవడు ఆడాలని ఆయన అన్నారు. తాజాగా ఈటీవీ భారత్‌కు ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన తన మనవడి గురించి పలు ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు.
"1999లో రచిన్ పుట్టాడు. అతడి తండ్రి రవి కృష్ణమూర్తి రచిన్‌కు తొలి గురు. క్లబ్ క్రికెట్‌లో ఆడటం వల్ల రచిన్‌కు క్రికెట్‌లో అనుభవం ఉంది. ఇక తన తండ్రితో పాటు రచిన్ కూడా పలు ప్రాంతాలకు క్లబ్ క్రికెట్ ఆడేందుకు వెళ్లేవాడు. ఇక అప్పటి నుంచి తనకు క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది." అని రచిన్ తొలి అడుగుల గురించి తాతయ్య బాలకృష్ణ చెప్పుకొచ్చారు.