యువ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్(Vijay Shankar) పడే ఇబ్బందులు తనకు తెలుసని టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అన్నాడు. విజయ్ వరుస గాయాలతో సతమతం అవుతున్నాడని తెలిపాడు. కొందరు గాయాల పట్ల సున్నితంగా ఉండలేరని అశ్విన్ పేర్కొన్నాడు. చక్కగా ఆడగల అనుభవం శంకర్‌కు ఉందని వెల్లడించాడు.
"విజయ్ మంచి ఆటగాడు. ప్రపంచకప్ ఆడాడు. అతడికి చాలా అనుభవం ఉంది. అతడు చాలాసార్లు గాయపడ్డాడు. అతడి గాయాల గురించి నాకన్నా బాగా ఎవరూ అర్థం చేసుకోలేరు. కొన్నిసార్లు ఆటగాళ్లు వాటిపట్ల సున్నితంగా ఉండరు. శంకర్ కచ్చితంగా ఇబ్బంది పడ్డాడు. అతడో పరిష్కారం కనుగొని వాటి నుంచి బయటపడతాడని భావిస్తున్నా."
- రవిచంద్రన్ అశ్విన్, టీమ్ఇండియా స్పిన్నర్
"వయసు పెరుగుతుంటే గాయపడకుండా ఉండటం కష్టం. ఇప్పుడు విజయ్ 30-31 ఏళ్ల మధ్య ఉన్నాడు. మరి వయసు పెరుగుతుంటే గాయాలతో కష్టమే కదా. అయితే తమిళనాడు జట్టులో ఆటగాళ్లకు సరైన పాత్రలు ఇవ్వాలి. కుర్రాళ్లు, సీనియర్లతో జట్టును సమతూకంగా ఉంచాలి. మేం విజయ్ శంకర్ అనుభవాన్ని ఉపయోగించుకొంటాం. కుర్రాళ్లతో కలుపుగోలుగా ఉంటాం. జట్టు సమతూకం పెరిగే కొద్దీ వారికి మరిన్ని అవకాశాలు ఇస్తాం" అని అశ్విన్ తెలిపాడు.
తమిళనాడుకు చెందిన విజయ్ శంకర్ 2019 వన్డే ప్రపంచకప్(2019 world cup)లో అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. అయితే టోర్నీలో ఆశించిన మేరకు అతడు రాణించలేదు. దాంతో ఆ తర్వాత జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. పునరాగమనం చేసే పరిస్థితులు కనిపించడం లేదు.
ఇదీ చూడండి:'ఆస్ట్రేలియా పర్యటన నన్ను మార్చేసింది'