తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్ఇండియాలో పుజారాకు డోర్ క్లోజ్​.. అతడి కెరీర్ ముగిసినట్టేనా? - Pujara Test Career

Pujara Test Career : విండీస్ పర్యటనకు టెస్టు జట్టులో నుంచి సీనియర్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారాను బీసీసీఐ తప్పించింది. దీంతో అతడి కెరీర్ అయోమయంలో పడిందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇంతకీ అతడి గత ప్రదర్శనలు, వైఫల్యాలు ఏంటో ఓసారి చూద్దాం.

Pujara Test Career
పుజారా టెస్టు కెరీర్ ముగిసినట్టేనా

By

Published : Jun 23, 2023, 9:40 PM IST

Pujara Test Career : శివ్​సుందర్ దాస్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన సెలెక్షన్ కమిటీ శుక్రవారం.. వెస్టిండీస్ పర్యటనకు టీమ్ఇండియా టెస్టు జట్టును ప్రకటించిది. అయితే జట్టులో సీనియర్ ప్లేయర్ పుజారాకు సెలెక్షర్లు మొండి చేయి చూపారు. యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్​ లాంటి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. కాగా డబ్ల్యూటీసీ 2023-25 దృష్టిలో ఉంచుకొని సెలెక్షన్ కమిటీ.. జట్టులో పలు కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇక పుజారా టెస్టు కెరీర్​కు శుభం కార్డు పడినట్లేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీస్​లో కూడా పుజారాతో పాటు రహానేను కూడా జట్టు నుంచి తొలగించారు. కాగా ప్రస్తుతం రహానేను జట్టులో ఎంపిక చేసి అతడికి వైస్​కెప్టెన్​గా ప్రమోషన్ కూడా ఇచ్చారు సెలెక్టర్లు.

పుజారా టెస్టు కెరీర్ ముగిసినట్టేనా..?
భారత్​కు టెస్టు మ్యాచ్​లు అనగానే గుర్తుకొచ్చే పేరు ఛెతేశ్వర్ పుజారా. అతడు క్రీజులో ఉంటే జట్టు గెలుస్తుందన్న ఓ నమ్మకం. అతడి ఆటతీరుతో టీమ్ఇండియా 'నయావాల్'గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ద్రవిడ్ రిటైరయ్యాక.. చాలా కాలానికి పుజారా రూపంలో టీమ్ఇండియాకు ఓ నిలకడ ఉన్న ఆటగాడు దొరికాడని మాజీ క్రికెటర్లు ఎందరో ఆతడిని ప్రశంసించారు. కానీ గత కొద్దిరోజుల నుంచి పుజారా మైదానంలో పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో అతడిని మరోసారి జట్టులో నుంచి తప్పించారు. ఈ తరుణంలో సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్.. జట్టులో మూడో స్థానం కోసం ఇంకా దారులు మూసుకుపోలేదని, మళ్లీ ఫస్ట్​ క్లాస్​ క్రికెట్​కు వెళ్లి తిరిగి ఫామ్ సాధించవచ్చని పుజారాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇంతకు ముందు కూడా జట్టులో స్థానం కోల్పోయినప్పుడు పుజారా.. ఇంగ్లాండ్​కు వెళ్లి కౌంటీ క్రికెట్​లో ససెక్స్ జట్టు తరఫున ఆడాడు. అక్కడ మంచి ప్రదర్శన కనబర్చిన పుజారా.. 2022లో ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు మ్యాచ్​తో టీమ్ఇండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్​తోనే పుజారా తన కెరీర్​లో 100 టెస్టుల మైలురాయి అందుకున్నాడు. కాగా బంగ్లాదేశ్​పై చేసిన పుజారా 102 పరుగులు మినహాయిస్తే.. అతడు గత మూడేళ్లుగా చెప్పుకొదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. కేవలం 26 సగటుతో ఫామ్​లేమితో నానాతంటాలు పడ్డాడు.

"ఈ ఏడాది ప్రారంభంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​లో విఫలమైన పుజారాను జట్టులో నుంచి తొలగించే సందర్భం వచ్చినప్పుడు.. డబ్ల్యూటీసీ ఫైనల్​కు ముందు మార్పులు చేసేందుకు సెలెక్టర్లు ఇష్టపడలేదు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్​లో పుజారా రెండు ఇన్నింగ్స్​ల్లో విఫలమైన తర్వాత సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ సుందర్ దాస్.. హెడ్ కోచ్​ ద్రవిడ్​తో అతడి గురించి తప్పక మాట్లాడి ఉంటాడు. మళ్లీ వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్​ అనేది రెండేళ్ల పాటు జరిగే టోర్నీ.. ఇందుకోసం జట్టులో పెద్ద మార్పులు చేయలేం. పుజారా మూడేళ్లుగా ఫామ్​ కోల్పోయి పేలవంగా ఆడుతున్నాడు. కోహ్లీ కూడా భారీ స్కోర్లు చేయకున్నా.. అతడు ఎప్పుడు ఫామ్​ కోల్పోయినట్లు కనిపించలేదు. పుజారా ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత సెలెక్టర్లకు తన ఫామ్​పట్ల ఎప్పుడూ నమ్మకం కలిగించే ఇన్నింగ్స్ ఆడలేదు. అందుకే అతడిపై వేటు తప్పలేదు" అని సెలెక్షన్ ప్యానెల్ అధికారి ఒకరు తెలిపారు.

ఇక టెస్టుల్లో 103 మ్యాచ్​లు ఆడిన పుజారా 176 ఇన్నింగ్స్ ల్లో 44.37 సగటుతో 7195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా గత మూడేళ్లలో పుజారా ఆడిన 48 ఇన్నింగ్స్​ల్లో కేవలం ఒకే శతకం సాధించాడు. ఇందులో ఏకంకా ఐదుసార్లు డకౌట్​గా వెనుదిరిగాడు. అయితే పుజారా తిరిగి ఫామ్ అందుకొని మళ్లీ టీమ్ఇండియా జట్టులో స్థానం సంపాదించాలని అతడి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details