Pujara Rahane: వరుసగా విఫలం అవుతున్న టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టులు ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె.. రంజీ ట్రోఫీలో ఆడనున్నారు. జయ్‌దేవ్ ఉనద్కత్ సారథ్యం వహించనున్న సౌరాష్ట్ర జట్టుకు పుజారా ప్రాతినిధ్యం వహించనున్నాడు. యంగ్ క్రికెటర్ పృథ్వీ షా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ముంబయి తరఫున బరిలోకి దిగనున్నాడు రహానె.
ఈ ఇద్దరూ కొంతకాలంగా టెస్టుల్లో ఆశించిన రీతిలో రాణించలేకపోతున్నారు. నెల కిందట జరిగిన సౌతాఫ్రికా సిరీస్‌లో మరీ దారుణంగా ఆడారు. మూడు మ్యాచుల ఈ సిరీస్‌లోని ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి పుజారా(124), రహానె(136) పరుగులు మాత్రమే చేశారు. త్వరలో శ్రీలంక.. భారత్‌లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలోనే రంజీలో సత్తాచాటి.. మళ్లీ టీమ్ ఇండియాలోకి రావాలని ఆశిస్తున్నారు.
పడిపోయిన సగటు..
- రహానె చివరగా ఆసీస్‌పై మెల్బోర్న్లో సెంచరీ చేశాడు. రెండేళ్లలో అతడి గురించి చెప్పుకోదగిన మ్యాచ్ ఇదొక్కటే. అప్పటినుంచి 27 ఇన్నింగ్స్‌ల్లో 20.25 సగటుతో 547 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో అతని కెరీర్ యావరేజ్ కూడా 43 నుంచి 39కి పడిపోయింది.
- రహానె చివరగా 2019-20 సీజన్లో రంజీ ట్రోఫీలో పాల్గొన్నాడు. అప్పుడు ముంబయి ఆడిన 8 లీగ్ మ్యాచ్‌ల్లో ఒకటే గెలిచి.. నాకౌట్‌కు అర్హత సాధించలేకపోయింది.
మూడేళ్లయింది..
- పుజారా కూడా ఆసీస్‌పైనే మూడేళ్ల కింద చివరగా మూడంకెల స్కోరు చేశాడు. ఆ తర్వాత.. మళ్లీ ఆ మార్కు చేరుకోలేదు. అప్పటినుంచి 48 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడగా.. 27.38 సగటుతో 1287 పరుగులే చేశాడు. 91 అత్యధిక స్కోరు. ఈ సమయంలో పుజారా యావరేజ్ 47 నుంచి 44.25కు తగ్గింది.
- పుజారా చివరగా 2019-20 సీజన్లోనే ఫైనల్ మ్యాచ్ ఆడాడు. బంగాల్పై 66 పరుగులు సాధించి.. సౌరాష్ట్ర టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుత రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర, ముంబయి.. ఒడిశా, గోవాలతో కలిసి గ్రూప్-డిలో ఉన్నాయి. ఈ లీగ్ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోనే జరగనున్నాయి.
Ranji Trophy 2022: రంజీ టోర్నీ ఫిబ్రవరి 10 నుంచి జరగనుండగా.. శ్రీలంకతో ఇండియా సిరీస్ లోపు వీరు ఫామ్‌లోకి రావాలని ఆశిస్తున్నారు సెలక్టర్లు.