Pujara Performance: టీమ్‌ఇండియా సీనియర్ బ్యాటర్ పుజారా సరిగ్గా ఆడకపోతే త్వరలోనే జట్టులో చోటు కోల్పోతాడని మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ అన్నాడు. టీమ్‌ఇండియాలోకి వచ్చేందుకు శ్రేయస్ అయ్యర్ లాంటి యువకులు ఎదురుచూస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్లు రాణించాలని చెప్పాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మాజీ సెలెక్టర్.. పుజారాపై స్పందించాడు.
"భారత బ్యాటింగ్ యూనిట్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. కేఎల్ రాహుల్ మినహా ఎవ్వరూ రాణించడం లేదు. ప్రతిసారీ అతడిపైనే ఆధారపడలేం. అలాగే కెప్టెన్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. అయితే ఇక్కడ పుజారా గురించి చెప్పుకోవాలి. అతడు పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతడి స్థానంలో ఇటీవల న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించిన శ్రేయస్ లాంటి యువకులు ఎదురుచూస్తున్నారు. పుజారా లాంటి సీనియర్ బ్యాటర్ తరచూ ఇలాగే విఫలమైతే త్వరలోనే చోటు కోల్పోవాల్సి ఉంటుంది" అని శరణ్‌దీప్ వివరించాడు.