సుదీర్ఘ నిరీక్షణను 'నయా వాల్' బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్‌లో సహనానికి మారుపేరుగా నిలిచిన అతగాడు ఒకానొక సమయంలో జట్టుకు భారంగా మారాడనే విమర్శలు తెచ్చుకొన్నాడు. ఇంకెన్నాళ్లు భరిస్తారు అనే మాటలు వినిపించాయి. దీంతో జట్టులో స్థానం కూడా కోల్పోవాల్సి వచ్చింది. టెస్టుల్లో వరుసగా కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన ఛెతేశ్వర్ పుజారా టెస్టుల్లో ఎప్పుడో జనవరి 2019లో సెంచరీ బాదాడు. ఇప్పుడు తాజాగా 52 ఇన్నింగ్స్‌లు.. 1,443 రోజులు గడిస్తేకానీ మరో శతకం పుజారా ఖాతాలో పడటం గమనార్హం. ఎట్టకేలకు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో గుండెలపై భారం దించుకొన్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లోనే (90) శతకానికి కాస్త దూరంలో నిలిచి నిరాశకు గురైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేసేశాడు.
'ఎన్నాళ్లో వేచిన ఉదయం'.. 52 ఇన్నింగ్స్.. 1,443 రోజులు.. పుజారా సెంచరీ సాధించేశాడోచ్! - india bangladesh test match 2022
ఒక క్రికెటర్ జీవితంలో నాలుగేళ్ల కాలం చాలా విలువైంది. స్టార్ ప్లేయర్లు కూడా జట్టులోస్థానం కోల్పోయి కనుమరుగవుతుంటారు. అయితే పుజారా మాత్రం పడిన చోటే లేచి నిలబడి.. తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఫామ్ కోసం పడిన కష్టానికి సరైన ఫలితం పొందాడు. 1,443 రోజుల తర్వాత సెంచరీ సాధించాడు.
దాదాపు నాలుగేళ్ల తర్వాత కెరీర్‌లో 19వ శతకం బాదిన పుజారా.. ఇదేదో ఆచితూచి ఆడుతూనో.. ఎక్కువ బంతులను వృథా చేసి సెంచరీ సాధించలేదు. జట్టుకు అవసరమైన సమయంలో వన్డే మాదిరిగా దూకుడు ప్రదర్శిస్తూనే కేవలం 130 బంతుల్లోనే 102 పరుగులు రాబట్టాడు. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (110)తో కలిసి రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించాడు. దీంతో బంగ్లా ఎదుట 500కిపైగా భారీ లక్ష్యం నిర్దేశించడంలోకీలక పాత్ర పోషించాడు.
కారణమదేనా..?
జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత పుజారా వంటి స్టార్ ఆటగాడు దేశీయ పోటీల్లో ఆడతాడని ఎవరూ ఊహించి ఉండరు. అలాగని కేవలం దేశవాళీ క్రికెట్ ఆడితే ఇక్కడి పిచ్ పరిస్థితులు మాత్రమే తెలుస్తాయి. విదేశాల్లో రాణించాలంటే ఆ తరహా వికెట్ మీద ఆడితేనే ప్రయోజనం ఉంటుందని భావించాడు. దీంతో కౌంటీ క్రికెట్‌కు నిలయమైన యూకేకి పయనమయ్యాడు. సర్రే తరఫున ఆడిన పుజారా.. వరుస మ్యాచుల్లో సెంచరీలతో కదం తొక్కాడు. ఇవన్నీ టెస్టులు అనుకొంటే పొరపాటే.. కేవలం 50 ఓవర్ల మ్యాచుల్లోనే దంచి కొట్టాడు. వన్డేలకు కూడా పనికొస్తాననే సంకేతం పంపాడు. సర్రే తరఫున ఆడిన అనుభవంతో ఫామ్‌లోకి వచ్చిన పుజారాకి.. తాజాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ మంచి అవకాశంలా దొరికింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతంగా ఆడిన పుజారాకు నాలుగేళ్లపాటు శతకం కొట్టలేదనే భారం కూడా దిగిపోయింది. రానున్న కాలంలో ఈ 'నయా వాల్' కఠిన పరిస్థితుల్లోనూ దృఢంగా ఆడతాననే భరోసాను అభిమానుల్లో కల్పించాడు.