గత కొంత కాలంగా టీమ్‌ఇండియాలో చోటు దక్కించులేకపోతున్నాడు పృథ్వీ షా. ఎలాగైనా తిరిగి జాతీయ జట్టులోకి రావాలనే పట్టుదలతో ఉన్న ఈ యువ ఆటగాడు రంజీ ట్రోఫీలో సత్తా చాటుతున్నాడు. ఎలైట్ గ్రూపు-బిలో అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 383 బంతుల్లోనే 49 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 379 పరుగులు చేశాడు. త్రుటిలో క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్సయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా పృథ్వీ షా నిలిచాడు. అతనికంటే ముందు 1948లో భౌసాహెబ్ నింబాల్కర్ మహారాష్ట్ర తరపున కతియావార్‌పై (443*) పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.
తొలి రోజు (మంగళవారం) 283 బంతుల్లో 240 పరుగులు చేసిన పృథ్వీ షా.. రెండో రోజు (బుధవారం) 99 బంతుల్లో 139 పరుగులు చేసి రియాన్ పరాగ్ బౌలింగ్‌లో 379 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఈ యువ ఆటగాడు చెలరేగి ఆడటంతో ముంబయి 687/4 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అస్సాం ఒక వికెట్ నష్టానికి 129 పరుగులు చేసింది.