టీమ్ఇండియా మహిళల జట్టులో 'అంతా నేనే, నా తర్వాతే ఎవరైనా' అనే అహంకారపూరిత సంస్కృతి నెలకొందని, అది పూర్తిగా తొలగిపోవాలని మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రవిడ్‌కు లేఖ రాశారు. ఇటీవల మహిళల జట్టుకు క్రికెట్ సలహా కమిటీ.. మాజీ కోచ్ రమేశ్ పొవార్‌ను ఎంపిక చేయడం వల్ల రామన్ ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన గంగూలీ, ద్రవిడ్‌కు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రామన్ ఎప్పుడూ క్రికెటర్ల వ్యక్తిగత ప్రాముఖ్యతల కన్నా జట్టుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
'టీమ్‌ఇండియాలో ఆ పద్ధతి పోవాలి': గంగూలీకి రామన్ లేఖ - రాహుల్ ద్రవిడ్
టీమ్ఇండియా మహిళా జట్టులో అహంకారపూరిత సంస్కృతి వచ్చిందని మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ ఆరోపించారు. ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, ఎన్‌సీఏ హెడ్ ద్రవిడ్‌లకు లేఖ రాశారు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
రామన్ రాసిన ఈ లేఖ ఇప్పుడు భారత క్రికెట్‌లో దుమారం లేపే విధంగా కనిపిస్తోంది. క్రికెటర్లతో విభేదాలున్న ప్రతిసారి కోచ్‌లు తప్పుకుంటున్నారని, లేదా వారినే తొలగిస్తున్నారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో రామన్ ఎవరి పేరూ ప్రస్తావించకుండా ఆ లేఖలో జాగ్రత్తపడ్డారు. జట్టులో తామే స్టార్ క్రికెటర్లమనే భావన బలంగా ఉందని, అది జట్టుకు మరింత చేటు చేస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తపర్చినట్లు సమాచారం. మరోవైపు ఈ లేఖను ఎన్‌సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్‌కు పంపించడంలో ఓ ముఖ్యమైన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. క్రికెటర్ల కోచింగ్‌కు సంబంధించిన అంశాలతో పాటు, శిక్షణా విషయాల్లోనూ ఎన్‌సీఏనే ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తుంది. దాంతో రామన్ టీమ్‌ఇండియా మహిళల క్రికెటర్లకు సంబంధించి ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌లో సూచనలు, సలహాలు చేయాలంటే రాహుల్ ద్రవిడ్ పెద్ద దిక్కుగా కనిపిస్తున్నాడు. అందువల్లే ద్రవిడ్‌కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి:'అందుకే నంబర్ వన్ స్థానంలో టీమ్ఇండియా'