Sunrisers Hyderabad Auction 2022: ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) యాజమాన్యం వ్యవహరించిన తీరు చూసి అభిమానులు అసహనానికి గురయ్యారు. "చాయ్, బిస్కెట్ల కోసం సన్‌రైజర్స్ వేలానికి వచ్చింది" అని సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ కూడా పేలాయి. విదేశీ ఆటగాళ్లు నికోలస్ పూరన్, ఆల్‌రౌండర్ షెఫర్డ్.. అభిషేక్ శర్మ వంటివారి కోసం ఊహించని మొత్తాన్ని చెల్లించింది. ముఖ్యంగా ఫామ్‌లోని లేని పూరన్‌కు రూ.10.75 కోట్లు భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. ఇది చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ నిర్ణయం సరైనదేనా? అని సందేహాలు వ్యక్తమయ్యాయి.
కిషన్‌కు గురి పెట్టాం.. కానీ
అయితే పూరన్ భారీ ధరకు కొనుగోలు చేయడం వెనుకున్న కారణాన్ని వెల్లడించాడు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ సభ్యుడు, శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. తాము ముందుగా ఇషాన్ కిషన్‌ను దక్కించుకోవాలని భావించినా.. ఆ ప్లాన్ బెడిసి కొట్టిందని.. దీంతో ప్లాన్ బీ అమలు చేసినట్లు తెలిపాడు.
"కిషన్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకున్నాం. కానీ ముంబయి భారీ ధరకు (రూ.15.25కోట్లు) అతన్ని కొనుగోలు చేసింది. ఆ ధర మా బడ్జెట్‌ను దాటేసింది. దాంతో సీజన్ మొత్తం జట్టుకు అందుబాటులో ఉండే మరో వికెట్ కీపర్ బ్యాటర్ కావాలని అనుకున్నాం. ఈ క్రమంలోనే కిషన్ తర్వాత నికోలస్ పూరన్‌కు ఓటేశాం" అని మురళీధరన్ వివరించాడు.
జట్టులో జానీ బెయిర్‌స్టో ఉన్నప్పటికీ.. అతడు సీజన్ మొత్తం అందుబాటులో ఉంటాడో? ఉండడో? అనే అనుమానం తమకు ఉందని మురళీధరన్ తెలిపాడు. ఈ క్రమంలో పూరన్‌కు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు చెప్పాడు. అతని ఫామ్‌పై పాజిటివ్‌గా ఉన్నామని చెప్పిన మురళీధరన్.. పూరన్ అంత ధర పలికాడంటే మిగతా జట్లు కూడా అతన్ని కావాలని అనుకున్నట్లే కదా అని స్పష్టం చేశాడు.
కాగా గతేడాది ఐపీఎల్ సీజన్లో పూరన్ పేలవ ప్రదర్శన చేశాడు. 12 మ్యాచుల్లో ఆడిన అతను కేవలం 85 పరుగులే చేశాడు. అయితే ఇటీవల భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచుల్లోనూ 50పైగా చొప్పున పరుగులు చేశాడు. దీంతో రాబోయే ఐపీఎల్లో కూడా అతను మంచి ప్రదర్శన చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:Suresh Raina CSK: రైనాకు సీఎస్కే భావోద్వేగ వీడ్కోలు