ICC Women's World Cup: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడనున్న ఆస్ట్రేలియా జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆస్ట్రేలియా-భారత్ మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తున్న సమయంలో.. శనివారం ఉదయం ఈ ప్రకటన చేశారు. ఇంగ్లాండ్‌తో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది కంగారూ జట్టు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఉదయం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
''ఆస్ట్రేలియా మహిళల జట్టుకు ముందుగా నా అభినందనలు. రేపు (ఆదివారం) వన్డే ప్రపంచకప్ ఫైనల్లో వారు గొప్పగా ఆడాలని ఆశిస్తున్నాను.''
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని
ఇప్పటివరకు 11 మహిళల వన్డే వరల్డ్‌కప్‌లు జరగ్గా.. ఆసీస్ 6, ఇంగ్లాండ్ 4 సార్లు టైటిల్ విజేతలుగా నిలిచాయి. న్యూజిలాండ్ ఓసారి టోర్నీ గెలిచింది. 2017లో జరిగిన చివరి ప్రపంచకప్‌లో భారత్‌పై గెలిచి.. ఛాంపియన్‌గా అవతరించింది ఇంగ్లాండ్. ఈసారి ఆసీస్‌పై గెలిచి.. టైటిల్ నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ రెండు జట్లూ వరల్డ్‌కప్ ఫైనల్లో చివరిసారిగా 1988లో తలపడ్డాయి. అప్పుడు ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది ఆసీస్. మళ్లీ 34 ఏళ్లకు ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
ఈ మెగా టోర్నీలో ఆసీస్‌కు మెరుగైన రికార్డు ఉంది. మొత్తం ఏడు సార్లు ఫైనల్‌కు వెళ్లి.. ఆరు సార్లు టైటిల్ గెల్చుకుంది. ఒకే ఒక్కసారి న్యూజిలాండ్ చేతిలో(200లో) అదీ 4 పరుగుల తేడాతో ఓడింది. మరోవైపు.. ఇంగ్లాండ్ 4 సార్లు టైటిల్ గెల్చుకొని.. మరో 3 సార్లు ఫైనల్లో ఓటమిపాలైంది. ఆ మూడు సార్లూ ప్రత్యర్థి ఆసీస్ కావడం ఆ జట్టుకు కలవరపరుస్తోంది. ఫైనల్లో ఇంగ్లాండ్ ఒకే ఒక్కసారి ఆసీస్‌పై గెలిచింది. అదీ 1973లో జరిగిన మొట్టమొదటి ప్రపంచకప్‌లో. మరి ఈసారి గెలిచి ఆసీస్ ఏడో టైటిల్ సాధిస్తుందా? ఇంగ్లాండ్ ఛాంపియన్ హోదాను నిలుపుకుంటుందా? అనేది చూడాలి.
ఇదీ చదవండి: 'ఆ 35 పరుగులే నాకు అత్యుత్తమం'- 11 ఏళ్లు వెనక్కి వెళ్లిన కోహ్లీ