భారత మహిళా క్రికెటర్ల ఫీల్డింగ్ ప్రమాణాలు చాలా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మ అన్నాడు. మైదానంలో పరుగు తీసే విషయంలో విదేశీ మహిళా క్రికెటర్లతో పోల్చుకుంటే టీమ్‌ఇండియా క్రికెటర్లు చురుగ్గా ఉండరని చెప్పాడు. భారత అండర్-19 జట్టుతో కలిసి పని చేసిన అభయ్ మార్చిలో మహిళల జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.
'అమ్మాయిల ఫీల్డింగ్ చాలా మెరుగవ్వాలి' - టీమ్ఇండియా ఫీల్డింగ్ గురించి అభయ్ శర్మ
టీమ్ఇండియా మహిళా క్రికెటర్లు ఫీల్డింగ్‌లో చాలా మెరుగవ్వాల్సి ఉందని తెలిపాడు ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మ. ఆటలో మార్పునకు అనుగుణంగా ఆటగాళ్లు దృఢంగా, చురుగ్గా ఉండాలని చెప్పాడు.
"ఫీల్డింగ్ విషయంలో మహిళా క్రికెటర్లు చాలా మెరుగవ్వాలి. ఆటలో చాలా మార్పు వస్తోంది. అందుకు తగ్గట్టుగా దృఢంగా, చురుగ్గా మారడం ముఖ్యం. అమ్మాయిలు బంతిని త్రో చేయడంలోనూ ఇబ్బంది పడుతున్నారు. కెరీర్ ఆరంభంలో సాంకేతికంగా సరిగా లేకపోతే.. తర్వాత గాయాలపాలయ్యే ప్రమాదముంటుంది. సాంకేతిక సమస్యలను అధిగమించిన తర్వాత దృఢత్వంపై దృష్టిసారించొచ్చు. ఫిట్‌నెస్, ఫీల్డింగ్ విషయంలో విదేశీ క్రికెటర్లకు, మన అమ్మాయిలకు మధ్య అంతరం ఎక్కువే అన్నది అంగీకరించక తప్పదు. దక్షిణాఫ్రికా మహిళలు మైదానంలో వేగంగా కదులుతారు. వారు దృఢంగా కూడా ఉంటారు. క్రికెట్లో వికెట్ల మధ్య పరుగుది కీలకపాత్ర. జట్టులో మంచి సమన్వయం ఉంటే సింగిల్స్‌ను రెండు పరుగులుగా మలచొచ్చు. అలా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే అవకాశముంటుంది." అని అభయ్ చెప్పాడు.