Players Last World Cup : 2023 వరల్డ్‌కప్ ముగిసింది. ఫైనల్లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా.. విశ్వవిజేతగా నిలిచింది. దీంతో ప్రపంచకప్ కోసం 12 ఏళ్ల టీమ్ఇండియా నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. అయితే అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న భారత్.. ఈసారి కచ్చితంగా కప్పు కొడుతుందని ఆశించారంతా. కానీ, చివరి మ్యాచ్‌లో టీమ్ఇండియాకు కలిసి రాలేదు. మరో వరల్డ్‌కప్ కోసం ఇంకో నాలుగేళ్లు ఆగాల్సిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ప్లేయర్లు.. వయసు రీత్య 2027లో టీమ్ఇండియాలో ఉండకపోవచ్చు.
ఫిట్నెస్ ఇబ్బందులతో ఆయా ప్లేయర్లు 2027 వరల్డ్‌కప్ ఆడటం కష్టమనే చెప్పాలి. ఈ క్రమంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెక్ట్స్ వరల్డ్‌కప్ ఆడటం అనుమానమే. ప్రస్తుతం అతడి వయసు 36 ఏళ్లు. ఫిట్నెస్ సమస్యలతో రోహిత్.. ఇప్పుడే అన్ని మ్యాచ్‌లు ఆడడం లేదు. దీంతో వచ్చే ప్రపంచకప్ నాటికి అతడు 40 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. ఆ వయసులో పూర్తి ఫిట్నెస్ సాధించడం కష్టమే.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వయసు 35 సంవత్సరాలు. ఇప్పుడు ఫిట్నెస్ పరంగా విరాట్‌కు ఇబ్బందులు లేవు. అయితే, నాలుగేళ్లనాటికి అంటే.. 39 ఏళ్లకు అతడు ఇంతే ఫిట్‌గా ఉంటాడని చెప్పలేం. అతడి ఆటతీరు ఇలాగే కొనసాగితే.. 2027లో ఆడే ఛాన్స్ ఉంది. కానీ, అది అంత సులువేం కాదు.