Pat Cummins 10 Wickets Test :పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్‌ల్లో (318-10&262-10) స్కోర్లు నమోదు చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 264-10 స్కోర్ చేసిన పాకిస్థాన్, 317 పరుగులు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఆసీస్ బౌలింగ్ దెబ్బకు పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులకే ఆలౌటై, 79 పరుగుల తేడాతో ఓడింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆసీస్ 2-0తో దక్కించుకుంది. ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ జనవరి 3న ప్రారంభం కానుంది. అయితే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన ఘనత సాధించాడు.
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కమిన్స్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 5/48, 5/49 ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో ఈ టెస్టులో మొత్తం కమిన్స్ 10 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అతడు 1991 తర్వాత ఈ గ్రౌండ్లో టెస్టు ఓ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇక తన పదునైన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును శాసించిన కమిన్స్‌కే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' లభించింది.