IPL Punjab Kings: ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ చరిత్రలో అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన ముంబయి ఇండియన్స్ పాయింట్ల పట్టికలో దిగువ స్థానంలో ఉంది. ఆ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని జట్టు సమష్టిగా ఆడుతోంది. పుణెలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు.. ముంబయి జట్టును 186 పరుగులకే కట్టడిచేశారు. దీంతో ముంబయి జట్టు వరుసగా ఐదో ఓటమిని చవిచూసింది.
ArshdeepSingh: అయితే పంజాబ్ జట్టుకు బ్యాటింగ్ సానుకూలాంశమే అయినప్పటికీ.. అర్ష్‌దీప్ సింగ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముంబయి ఇన్నింగ్స్‌లో ఇతడు 18వ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కీలక సమయంలో.. ఓ ఓవర్లో కూడా కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. 2019 సీజన్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు రెగ్యులర్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. గతంలోనూ ఎన్నో మంచి ప్రదర్శనలు చేశాడు. ఇక ఇతడి ఆటకు భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, పార్థివ్ పటేల్ తాజాగా ఆకర్షితులయ్యారు. అతడిని టీమ్ఇండియాలో కూడా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.