చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ మెంటార్ సింగ్ ధోనీ(Mentor Singh Dhoni) అని సంబోధించాడు. శుక్రవారం రాత్రి బెంగళూరుతో(CSK vs RCB 2021) జరిగిన పోరులో తొలుత ఆ జట్టు మ్యాచ్‌పై పట్టు కోల్పోయినట్లు కనిపించినా తర్వాత పుంజుకొని విజయం సాధించింది. బెంగళూరు బ్యాటింగ్‌లో భారీ స్కోర్ సాధించేలా కనిపించినా.. ధోనీ తన చాకచక్యంతో బౌలింగ్‌లో మార్పులు చేసి కోహ్లీసేనని 156 పరుగులకే కట్టడి చేశాడు. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌పై ధోనీకి ఉన్న అవగాహనను దృష్టిలో పెట్టుకొని పార్థివ్(Parthiv Patel News) ఇలా స్పందించాడు.
"మనం ఇప్పుడు మహీని మెంటార్ సింగ్ ధోనీ అని ఎందుకు అనాలో కారణం ఉంది. అతడెంతో కాలం నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటాడు. పిచ్‌లను అంచనా వేయడంలో దిట్ట. బౌలర్ల నుంచి సరైన ప్రదర్శన ఎలా రాబట్టాలో తెలిసిన వాడు. బ్రావో, శార్దూల్ లేదా దీపక్ ఇలా ఎవర్ని ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఆటగాళ్లు అతడిని బాగా నమ్ముతారు. ధోనీతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఎందుకంటే అతడికి అంత మంచి అనుభవం ఉంది. అంత గొప్ప విజయాలు ఉన్నాయి" అని పార్థివ్ చెన్నై కెప్టెన్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. కాగా, ధోనీని ఇటీవల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు మెంటార్‌గా ఎంపిక చేశారు. ఈ అర్థంలో పార్థివ్ టీమ్‌ఇండియా మాజీ సారథిని ప్రశంసించాడు.