Teamindia England Practice match: గతేడాది అర్ధాంతరంగా ఆగిపోయిన భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు ముగింపు పలికేందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. జులై 1 నుంచి ఆ సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు జరగనుంది. ఇప్పటికే ఆ మ్యాచ్ కోసం ఆతిథ్య దేశం వెళ్లిన భారత జట్టు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో భాగంగా నేడు (గురువారం) తొలి మ్యాచ్ ప్రారంభంకానుంది.
మన జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ వస్తుండగా.. ప్రత్యర్థి జట్టుకు సామ్ ఎవన్స్ సారథ్యం వహించనున్నాడు. అయితే ఈ పోరులో మన ప్లేయర్స్ అయిన పుజారా, పంత్, బుమ్రా, ప్రసిద్ద కృష్ణ.. ప్రత్యర్థి జట్టు తరఫున బరిలో దిగనున్నారు. ఈ నలుగురు ఆపోజిట్ టీమ్‌లో ఆడేందుకు లీసెస్టర్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్(ఎల్సీసీసీ), బీసీసీఐ, ఈసీబీ పర్మిషన్ కూడా ఇచ్చాయి. ఇరు జట్లు చెరో 13 మంది ఆటగాళ్లతో బరిలో దిగనున్నాయి.
అంతకుముందు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ముందు ట్రైనింగ్ సందర్భంగా మాజీ కెప్టెన్ కోహ్లీ.. జట్టులో ఉత్సాహం నింపేలా స్పీచ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన లీసెస్టర్ షైర్.. "గేమ్ మోడ్ యాక్టివేటెడ్. ప్రిపరేషన్స్ ముందు జట్టును ఉద్దేశించి విరాట్ కోహ్లీ ప్యాషనేట్ స్పీచ్" అని పోస్టు పెట్టింది.