Pant Meets Shaheen Afridi: క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ రానే వచ్చింది. ముఖ్యంగా భారత్, పాక్ మధ్య పోరు చూసేందుకు క్రీడాభిమానులు ఉత్కంఠతతో ఉన్నారు. కాగా, చివరిసారి ఈ రెండు జట్లు టీ20 ప్రపంచకప్‌లో పోటీ పడగా.. భారత్ ఓటమిపాలైంది. ఈ పరాజయానికి బదులు తీర్చుకోవాలని భారత్ బలంగా భావిస్తోంది. అయితే, ఈ పోరు కేవలం మైదానానికే పరిమితం. ఇరు దేశాల క్రికెటర్లు బయట కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటారు. అలాంటి ఘటనే తాజాగా దుబాయ్‌లో చోటుచేసుకుంది. గాయం కారణంగా ఆసియా కప్ టోర్నీకి దూరమైన పాక్ స్టార్ బౌలర్ షహీన్ షా అఫ్రిది.. భారత క్రికెటర్లను కలిసి ముచ్చటించాడు. ఈ సందర్భంగా అఫ్రిదికి, రిషభ్ పంత్‌కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
గాయంతో ఉన్న అఫ్రిది వద్దకు వెళ్లిన చాహల్ అతడిని కుశల ప్రశ్నలు అడిగాడు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించాడు. ఆపై విరాట్ కోహ్లీ సైతం షహీన్‌తో చేతులు కలిపి 'ఆరోగ్యం ఎలా ఉంది' అని అడిగాడు. జాగ్రత్తగా ఉండాలంటూ సూచించాడు. ఈ సందర్భంగా పంత్‌తో అఫ్రిది కాసేపు సరదాగా ముచ్చటించాడు. 'నీ కాలికి ఏమైంది' అని పంత్ అడగ్గా.. తాను ఇప్పుడు నడవలేని పరిస్థితుల్లో ఉన్నా అని చెప్పకనే చెబుతూనే పంత్‌ను కొనియాడాడు. 'నేను నీలా ఒంటి చేత్తో సిక్సులు కొట్టాలనుకుంటున్నా' అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే, దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అని పంత్ సమాధానమిచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య నవ్వులు పూశాయి.