తెలంగాణ

telangana

ఆ విమర్శలకు చెక్​ పెడుతూ.. 'పంత్'​ అద్వితీయ పోరాటం

పంత్‌ ఏంటి? ఇలా ఆడాడు. ఆ షాట్​ కొట్టడం అవసరమా? జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా అలా ఔటవుతారా?.. ఇవీ రెండో వన్డేలో పంత్​.. నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకోవడంపై వచ్చిన విమర్శలు! ఎందుకంటే.. ఆ పరిస్థితుల్లో పంత్​ ఒక్కడు నిలబడితే.. మ్యాచ్​ తీరే మారిపోతుంది. గెలిచి అవకాశాలు కచ్చితంగా ఉండేవి. అంతకుముందు కూడా చాలాసార్లు పరిమిత ఓవర్ల క్రికెట్​లో పంత్​ ఆటతీరుపై విమర్శలు వచ్చేవి. అయితే మూడో వన్డేలో వాటికి చెక్​ పెట్టాడు పంత్​. వికెట్లు వరుసగా కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టుకు.. గోడలా నిలబడ్డాడు. అద్భుతమైన సెంచరీతో.. మూడో వన్డేలో భారత్​ను విజయ తీరాలకు చేర్చాడు. వన్డేల్లో సెంచరీల ఖాతాను ఘనంగా తెరిచాడు.

By

Published : Jul 18, 2022, 7:27 AM IST

Published : Jul 18, 2022, 7:27 AM IST

Pant gave victory to India with a wonderful century
ఆ విమర్శలకు చెక్​ పెడుతూ.. 'పంత్'​ అద్వితీయ పోరాటం

బాధ్యతగా ఆడడు, నిర్లక్ష్యం ఎక్కువ, పరిపక్వత లేదు, వికెట్‌ పారేసుకుంటాడు అన్నవి పంత్‌పై తరచూ వచ్చే విమర్శలు. అయితే అద్వితీయ పోరాటం చేసిన ఈ ఎడమచేతి వాటం కుర్రాడు.. సంచలన బ్యాటింగ్‌తో ఇటీవల కాలంలో వన్డే క్రికెట్లో గొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఒకటి అనదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. అసాధారణ పట్టుదలను ప్రదర్శిస్తూ, అత్యంత బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆ విమర్శలకు బదులిచ్చాడు.

సూర్యకుమార్‌ను వెనక్కి పంపి భారత్‌ను చుట్టేయడానికి ఇంగ్లాండ్‌ సిద్ధమైన దశలో పంత్‌కు జోడయ్యాడు హార్దిక్‌. జట్టు ఒత్తిడిలో ఉన్నా.. ఇద్దరూ స్వేచ్ఛగానే బ్యాటింగ్‌ చేశారు. అప్పటికి క్రీజులో నిలదొక్కుకున్న పంత్‌ కాస్త జాగ్రత్తగా ఆడుతున్నా.. హార్దిక్‌ మాత్రం వస్తూనే దూకుడును ప్రదర్శించాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. క్రమంగా పంత్‌ కూడా జోరు పెంచి.. తరచుగా బంతిని బౌండరీ దాటించడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. అయితే భారత్‌పై రన్‌రేట్‌ ఒత్తిడేమీ లేదు. ఇంగ్లిష్‌ బౌలర్ల షార్ట్‌ బంతులు పంత్‌, హార్దిక్‌పై ఏమాత్రం పనిచేయలేదు. హార్దిక్‌ 43 బంతుల్లో, పంత్‌ 71 బంతుల్లో అర్దశతకం పూర్తి చేశారు.

అక్కడి నుంచి పంత్‌ దూకుడు మరింత పెరిగింది. ఒవర్టన్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతడు.. అతడి తర్వాతి ఓవర్లో వరుసగా 4, 6 దంచాడు. హార్దిక్‌ కూడా అంతే. కార్స్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు బంతులను బౌండరీ దాటించాడు. స్కోరు 200 దాటింది. కానీ జట్టు సాఫీగా గెలుపు దిశగా సాగుతున్న ఆ దశలో హార్దిక్‌ (36వ ఓవర్లో) ఔట్‌ కావడంతో భారత్‌లో కాస్త కలవరం. ఇంగ్లాండ్‌లో ఉత్సాహం వచ్చింది. కానీ మరింత రెచ్చిపోయి ఆడిన పంత్‌ వారి ఆశలపై నీళ్లు చల్లాడు. తమ శ్రమను వృథా కానివ్వలేదు. మరోవైపు జడేజా అండగా నిలవగా.. ఊహించిన దాని కంటే త్వరగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడి దూకుడుతో ఇంగ్లాండ్‌కు షాక్‌ తప్పలేదు. విల్లీ బౌలింగ్‌లో సిక్స్‌తో 95కు చేరుకున్నాడు. 106 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత అతడు విల్లీ బౌలింగ్‌లో వరుసగా అయిదు బౌండరీలు బాదడంతో భారత్‌ విజయం ఖాయమైపోయంది. రూట్‌ వేసిన 43వ ఓవర్‌ తొలి బంతిని బౌండరీ దాటించి పని పూర్తి చేశాడు పంత్‌. అతడు అర్ధశతకం నుంచి శతకానికి 35 బంతుల్లోనే చేరుకున్నాడు. మొత్తంగా 113 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో 8 ఓవర్లు ఉండగానే.. టీమ్​ఇండియా గెలవడం విశేషం. అద్భుత సెంచరీతో అదరగొట్టిన పంత్​కు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​, హార్దిక్​ పాండ్యకు మ్యాన్​ ఆఫ్​ ది సిరీస్(100 పరుగులు, 6 వికెట్లు)​ దక్కాయి.

ఇదీ చదవండి:పంత్​, హార్దిక్ ధనాధన్ ఇన్నింగ్స్​.. టీమ్​ఇండియాదే సిరీస్​

ABOUT THE AUTHOR

...view details