ఆసియాకప్ 2022 ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది శ్రీలంక. అదివారం దుబాయ్ వేదికగా జరిగిన తుదిపోరులో గెలిచి ట్రోఫీని ముద్దాడింది. పాకిస్థాన్ జట్టు మొదటి నుంచి మంచి ప్రదర్శనే చేసింది. విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. అయితే ఇప్పుడు ఆ జట్టు బ్యాటర్ ఫకర్ జమాన్‌పై సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆసియా కప్ ఫైనలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ డక్ ఔట్ అయ్యాడు. డక్ ఔట్ అవడం మామూలే.. దీనిపై చర్చ ఎందుకు అంటారా? దీనికి కారణం మరొకటి ఉంది.
అదేమిటంటే.. ఫకర్ జమాన్ ఆసియా కప్ ఫైనల్‌తో పాటు ఐదు సార్లు డక్ ఔట్ అయ్యాడు. అవి మామూలు డక్ ఔట్లు కాదు. గోల్డెన్ డక్ ఔట్లు. అంటే ఫీల్డ్‌లో దిగిన మొదటి బంతికే పెవీలియన్ చేరడం అన్నమాట. అయితే ఇందులో మరో విశేషం ఉంది. ఈ డక్ ఔట్లు అన్నీ టీ20 ఫార్మాట్లోనే జరిగాయి.
2019లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో మొదటి సారిగా గోడ్డెన్ డక్ ఔట్ అయ్యాడు ఫకర్ జమాన్. అదే సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఈ విధంగానే ఔట్ అయ్యాడు. 2021లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మరో సారి అదే తీరు కొనసాగింది. ఇక ప్రస్తుత సంవత్సరంలోనూ ఆస్ట్రేలియా, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పాకిస్థాన్ గోల్డెన్ ప్లేయర్ అని కొందరు అంటుంటే.. అయిదు బాతు గుడ్లు ఉన్నాయి.. రెండు రోజులు హాయిగా తినొచ్చు అని సరదాగా కమెంట్లు చేస్తున్నారు.
ఓటమికి పూర్తి బాధ్యత నాదే..
ఆసియా కప్ ఫైనల్ పోరులో పాకిస్థాన్ 23 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంక జట్టు ఆరోసారి ఆసియా కప్‌ను అందుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఓ కీలకమైన క్యాచ్‌ను పాక్ ఫీల్డర్లు ఢీకొని నేలపాలు చేయడం శ్రీలంకకు కలిసొచ్చింది. క్యాచ్‌ను జారవిడవడమే కాదు.. ఏకంగా ఆరు పరుగులు సమర్పించుకున్నారు కూడా. అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయిన లంక జట్టులో రాజపక్స మినహా ఇక మిగిలింది బౌలర్లు మాత్రమే. అలాంటి కీలక సమయంలో రాజపక్స ఇచ్చిన ఆ క్యాచ్‌ను జారవిడవడంతో పాక్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ క్యాచ్‌ను జారవిడిచినవారిలో ఒకరైన వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ స్పందించాడు. మ్యాచ్ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో షాదాబ్ రెండు క్యాచ్‌లను విడిచిపెట్టాడు.