ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ సహనం కోల్పోయాడు. తనను కామెంట్ చేసిన కొంతమంది ఫ్యాన్స్‌తో గ్రౌండ్‌లోనే గొడవకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే అతడు ఒక లోకల్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. పంజాబ్ ఫ్రావిన్స్‌లోని పక్‌పత్తన్ జిల్లాలో ఈ మ్యాచ్ జరిగింది.
అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో హసన్ అలీ బౌండరీ లైన్ వద్ద నిల్చున్నాడు. ఈ సమయంలో కొంతమంది ఆకతాయిలు హసన్ అలీపై కామెంట్స్ చేశారు. జట్టులో చోటు కోల్పోయి గల్లీ క్రికెట్ ఆడడానికి వచ్చాడు అంటూ ఆటపట్టించారు.కొంతమందైతే గడ్డి, పేపర్లను కూడా విసిరారు. అయినా అప్పటికీ చాలాసేపు ఓపికతో భరించిన హసన్ అలీ.. సహనం కోల్పోయి వారితో వివాదానికి దిగాడు. వారిని కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే పక్కన ఉన్నవారు పరిస్థితిని అదుపు చేసి హసన్ అలీని అడ్డుకున్నారు.