Pakistani Actress Comments On Team India : 2023 ఏడాది వన్డే ప్రపంచకప్‌లో టీమఇండియా సత్తా చాటుతోంది. లీగ్ మ్యాచుల్లో వరుస విజయాలతో దూసుకెళ్లి.. సెమీస్‌కు చేరుకున్న రోహిత్ సేన.. అదే దూకుడుతో సెమీస్ ఆడి ఇప్పుడు తుది పోరులోకి అడుగుపెట్టనుంది. సుమారు 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో టీమ్ఇండియా వెళ్లడం పట్ల క్రికెట్ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా భారత జట్టును కొనియాడుతున్నారు. మాజీలు సైతం మన ప్లేయర్లను అభినందనలు తెలుపుతూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే పాకిస్థాన్‌కు చెందిన నటి సెహర్ షిన్వారీ మాత్రం ఎప్పటిలాగే టీమ్ఇండియాను దుయ్యబట్టింది. బీసీసీఐతో పాటు టీమ్ఇండియాపై సంచలన కామెంట్స్ చేసింది. ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టి అసూయను కనబరిచింది.
"టీమ్ఇండియా ప్లేయర్లు మంచి నటులు. ఈ మ్యాచ్ ముందుగానే ఫిక్స్ అయ్యిందని వారికి కూడా తెలుసు. కానీ నిజంగానే మ్యాచ్ ఆడుతున్నట్లు భలే నటించారు. ఇలా భారత జట్టు మరోసారి ప్రపంచ కప్ ఫైనల్స్‌కు వెళ్లడాన్ని నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. భారత్ అన్నింటిలో మన దేశం కంటే ఎందుకు ముందు ఉందో అసలు అర్థం కావడం లేదు " అంటూ టీమ్ఇండియా పై వేర్వేరు ట్వీట్లలో తన కోపాన్ని బయటపెట్టింది.
ఇక ఈ పోస్టులు చూసిన క్రికెట్ అభిమానులు ఆ పాక్ నటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట ఆమెపై విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. కామెంట్ల రూపంలో ఆమెను తిట్టిపోస్తున్నారు. అయితే షిన్వారీ భారత జట్టుపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదేం తొలి సారి కాదు. ప్రపంచకప్ ప్రారంభం నుంచే వివిధ సందర్భాల్లో టీమ్ఇండియాపై అక్కసు చూపిస్తున్న ఈ నటి.. భారత్‌పై విజయం సాధిస్తే బంగ్లా ఆటగాళ్లతో డేటింగ్‌కు వెళ్తానంటూ అప్పట్లో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది.