Pakistan Vs Australia Test Series 2023 : ఆస్ట్రేలియాలో పాక్ ప్లేయర్లకు ఘోర అవమానం ఎదురైంది. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం శుక్రవారం ఆస్ట్రేలియా వెళ్లిన పాక్ ప్లేయర్లకు ఆతిథ్య దేశం స్వాగతం పలకలేదు. అటు పాకిస్థాన్ ఎంబసీ అధికారులు కూడా ఎయిర్‌పోర్టుకు రాలేదు. దీనికి తోడు పాకిస్థాన్ ప్లేయర్ల లగేజీ బ్యాగ్‌లను తీసుకెళ్లేందుకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో చేసేదేమీ లేక ప్లేయర్లే తమ లగేజీని మోసుకున్నారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ లగేజీని ట్రక్‌లోకి ఎక్కించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
అయితే తమ దేశానికి వచ్చిన జట్టుకు స్వాగతం పలకడం సదరు ఆతిథ్య క్రికెట్ బోర్డు కనీస కర్తవ్యం. కానీ పాకిస్థాన్ జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై క్రికెట్ అభిమానులతో పాటు పాకిస్థాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పర్యటన నిమిత్తం వచ్చిన దేశాలను అవమానించడం ఆస్ట్రేలియాకు ఇదేం తొలిసారి కాదని అభిమానులు మండిపడుతున్నారు. గతంలో కూడా అగ్ర జట్లకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేక క్రికెట్ ప్రియుల ఆగ్రహానికి గురైందని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఇక 2021లో భారత జట్టు పర్యటనలోనూ ఆసీస్ ఇలాగే ప్రవర్తించిందని వార్తలు వచ్చాయి. దీంతో కంగారూ క్రికెట్ బోర్డు ప్రవర్తనపై విమర్శలు వెల్లుత్తున్నాయి.