Pakistan Odi World Cup 2023 :వరల్డ్ కప్ మరో ఆరు రోజుల్లో ప్రారంభంకానుంది. మెగాటోర్నీలో టీమ్ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. అయితే రెండో సారి కప్పును ముద్దాడాలనే లక్ష్యం.. భారత్ గడ్డపై జయకేతనం ఎగురవేయాలనే సంకల్పంతో పాకిస్థాన్ వస్తోంది. ఈ సందర్భంగా జట్టు బలాబలాలను తెలుసుకుందాం..
పాకిస్థాన్‌లో ఒకప్పుడు మేటి ఆటగాళ్లు ఉండేవారు. తొలి వరల్డ్‌కప్ (1975) మినహాయిస్తే.. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు సెమీస్‌కు అర్హత సాధించింది. 1992లో ఛాంపియన్‌గా నిలిచింది. 1999లో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత నుంటి పాక్ ప్రదర్శన తగ్గుతూ వచ్చింది.
గత ఐదు వరల్డ్ కప్పుల్లో పాక్ బెస్ట్ పెర్ఫార్మెన్స్.. 2011లో సెమీస్ చేరడమే. 2019లో అయితే గ్రూప్ దశలోనే వైదొలిగింది. పాక్ ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేని పరిస్థితికి చేరుకుంది. అయితే ఈ సారి మాత్రం కాస్త బలంగానే కనిపిస్తోంది. కొంతకాలం నుంచి మెరుగ్గా ఆడుతోంది. టైటిల్‌కు గట్టిపోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బలాలు.. కెప్టెన్ బాబర్ అజామ్ - పేసర్ షహీన్ షా అఫ్రిది పాక్ జట్టుకు కొండంత బలం. బ్యాటింగ్‌లో బాబర్ కీలక ప్లేయర్. నిలకడగా రాణిస్తున్నాడు. బౌలింగ్‌లో షహీన్ షా జట్టుకు అత్యంత ప్రధానమైన పేసర్‌గా మారాడు. కొత్త బంతితో ఈ ఎడమ చేతి వాటం పేసర్ చాలా డేంజర్. హారిస్ రవూఫ్ కూడా మంచి వేగంతో బంతులను సంధిస్తున్నాడు. ఇక కొంతకాలంగా మంచిగా ఆడుతున్న వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌పై కూడా నమ్మకం పెట్టుకోవచ్చు. ఆల్‌రౌండర్ల సంఖ్య కూడా జట్టులో ఎక్కువే. అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్.. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలరు. ఇక పాక్ దేశం లాంటి పరిస్థితులే ఇక్కడ ఉండడంతో ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.
బలహీనతలు.. ఒత్తిడికి అస్సలు తట్టుకోలేదు. అదే ప్రధాన బలహీనత. ఈజీగా గెలవొచ్చనే మ్యాచ్‌లోనూ కాస్త ఒత్తిడికి తీసుకొస్తే.. అనూహ్య రీతిలో ఓడిపోతుంటుంది. అస్థిరతకు కేరాఫ్ అడ్రెస్. రీసెంట్గా ఆసియా కప్‌లో ఆడిన విధానం చూసిన అర్థమవుతుంది. బ్యాటింగ్‌లో భారం మొత్తం బాబర్, రిజ్వాన్‌పైనే ఉంది. వీళ్లు ఫెయిల్ అయ్యారా.. ఇక అంతే. మిడిల్, లోయర్ ఆర్డర్లో సరిగ్గా నిలబడే ప్లేయర్ లేడు. ఈ ఏడాది ప్రారంభంలో కివీస్‌పై వరుసగా మూడు శతకాలు బాదిన ఓపెనర్ ఫకర్ జమాన్ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. గాయంతో ప్రధాన పేసర్లలో ఒకడైన నసీమ్ షా దూరమయ్యాడు. నాణ్యమైన స్పిన్నర్లు లేరు. షాదాబ్ పేలవ ఫామ్‌తో ఉన్నాడు.