Pakistan odi world cup 2023 : ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో దాయాది దేశం పాకిస్థాన్ పాల్గొంటుందా..? లేదా..? అన్నదానిపై ఇంతకాలం అనిశ్చితి కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది. పాక్ జట్టు టీమ్ఇండియాలో పర్యటించేలా అక్కడి ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ఈ విషయాన్ని పాక్ ఫారెన్ మినిస్ట్రీ తెలిపింది. స్పోర్ట్స్‌ను పాలిటిక్స్ కోణంలో చూడట్లేదని వెల్లడించింది. అందుకే పాక్ జట్టును ఇండియాకు పంపుతున్నట్లు పేర్కొంది.
ODI world cup 2023 pak vs ind : అయితే తమ జట్టు భద్రతా దృష్ట్యా భారత్ పర్యటనకు పంపే విషయమై పాకిస్థాన్‌కు తీవ్ర ఆందోళనలు ఉన్నాయని, వాటిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, భారత అధికారులతో చర్చిస్తామని తెలియజేసింది. "భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల పరిస్థితి.. అంతర్జాతీయ క్రీడలకు, ఇతర అంశాలకు అడ్డంకిగా ఉండకూడదని పాకిస్థాన్ భావిస్తోంది. భారత పర్యటనలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు పూర్తి భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం" అని పాక్ ఫారెన్ మినిస్ట్రీ ఓ ప్రకటనను విడుదల చేసింది. తాము తీసుకున్న ఈ నిర్ణయం నిర్మాణాత్మక, బాధ్యతాయుతమైన విధానాన్ని సూచిస్తోందని తెలిపింది.