భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య తిరిగి క్రికెట్ కొనసాగాలని.. ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని ఆ జట్టు మాజీ సారథి ఇంజమామ్-ఉల్-హక్(Injamamul Haque) ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవలే ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన సందర్భంగా అతడీ వ్యాఖ్యలు చేశాడు. యాషెస్ సిరీస్(Ashes Series) కన్నా దాయాదుల పోరే ఎక్కువగా చూస్తారన్నాడు. ఆ క్షణాలను అభిమానులు పూర్తిగా ఆస్వాదిస్తారని చెప్పాడు.
"యాషెస్ సిరీస్ కన్నా ఎక్కువ ప్రజలు భారత్-పాక్ మ్యాచ్‌లను వీక్షిస్తారు. ఇందులో ప్రతి క్షణాన్ని వారు ఆస్వాదిస్తారు. ఇరు జట్ల మధ్య ఆట బలోపేతానికి, ఆటగాళ్ల అభివృద్ధికి ఆసియా కప్‌తో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం ఎంతో ముఖ్యం. మేం టీమ్‌ఇండియాతో ఆడే రోజుల్లో గొప్ప అనుభూతి కలిగేది. అలాంటి ద్వైపాక్షిక సిరీస్‌ల్లో సీనియర్ల నుంచి యువకులు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సచిన్, గంగూలీ, అజహరుద్దీన్, జావెద్ మియాందాద్ ఇలా ఎవరైనా కానీ కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు వారి దగ్గరికెళ్లి విలువైన సలహాలు, సూచనలు తెలుసుకునేవాళ్లు. ఒక క్రికెటర్ తన ఆటను అత్యుత్తమంగా తీర్చిదిద్దుకొనేందుకు అదో సువర్ణ అవకాశం."
- ఇంజమామ్-ఉల్-హక్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్