Shahid Afridi On Hardik Pandya : ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది.. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యపై ప్రశంసలు కురిపించాడు. అతడి లాంటి ఫినిషర్ పాకిస్థాన్‌కు లేడని అన్నాడు. పాక్ జట్టులో పలువురు ఉన్నప్పటికీ వాళ్లు రాణించడంలేదని పేర్కొన్నాడు. 'హార్దిక్ లాంటి ఫినిషర్ మాకు లేడు. అసిఫ్ అలీ, ఖుష్‌దిల్ ఆ పాత్ర పోషిస్తారని భావించినప్పటికీ.. వారు రాణించలేకపోతున్నారు. నవాజ్, షాదాబ్ కూడా ఆకట్టుకోవడంలేదు. ఈ నలుగురిలో కనీసం ఇద్దరైనా రాణించాలి' అని అన్నాడు.
బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్ విభాగాల్లో జట్టులోని లోపాలను సరిచేసుకోవాలని అఫ్రిది సూచించాడు. అలా అయితేనే వచ్చే నెలలో జరిగే ప్రపంచకప్‌లో రాణించగలరని పేర్కొన్నాడు. ప్రపంచకప్ సాధించాలని పాక్ జట్టు కలలు కంటే.. అందుకు తగినట్లుగా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. కొద్దిరోజులుగా చేస్తున్న తప్పులను పునరావృతం చేయకూడదని జట్టుకు సూచించాడు.
గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్య ఆపై విశేషంగా రాణిస్తున్నాడు. భారత టీ20 లీగ్‌లో మొదటిసారి భాగమైన గుజరాత్ జట్టుకు సారథ్యం వహిస్తూ.. తొలి సీజన్‌లోనే ఆ జట్టుకు ట్రోఫీని అందించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పలు మ్యాచ్‌లను గెలిపించాడు. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ.. అదే ఫామ్‌ను కొనసాగించిన పాండ్య సంచలన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్నందించాడు.