Rashid latif on india captain change: భారత జట్టుపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 1990లో పాకిస్థాన్ ఇలానే నాయకులను మార్చి తప్పు చేసిందని.. భారత్ కూడా ఇప్పుడు అదే తప్పు చేస్తోందన్నాడు. భారత్‌కు ఇప్పుడు గంగూలీ, ధోనీ, కోహ్లీ లాంటి నాయకులు కావాలని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన.. లతీఫ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
"ప్రస్తుతం అందరూ బ్యాకప్ కెప్టెన్‌లు గురించి మాట్లాడుతున్నారు. కానీ భారత్ మాత్రం గత ఏడాది నుంచి ఏకంగా ఏడుగురు సారథిలను మార్చింది. భారత క్రికెట్ చరిత్రలో నేను ఈ పరిస్థితిని చూడటం ఇదే మొదటిసారి. టీమ్ఇండియా వరుసగా విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి వారిని వివిధ సిరీస్‌లకు తమ సారథిలుగా నియమించింది. అది జట్టుకు మంచిది కాదు. ప్రస్తుతం భారత జట్టు తీరు చూస్తుంటే టీమ్ఇండియా సైతం 1990లలో పాకిస్థాన్ చేసిన తప్పే చేస్తున్నట్టుంది. భారత్‌కు నిలకడగల ఓపెనర్, మిడిల్ ఆర్డర్ దొరకలేదు. వారికి ఓ కొత్త కెప్టెన్ కావాలి. ఏ కెప్టెన్ కూడా నిలకడగా రాణించడం లేదు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఫిట్‌గా లేరు. విరాట్ కోహ్లీ మానసికంగా సిద్ధంగా లేడు. చాలా మంది కెప్టెన్లను మారుస్తున్నారు. భారత్‌కు ఇప్పుడు సౌరభ్ గంగూలీ, ఎమ్ఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్ కావాలి."
- రషీద్ లతీఫ్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్