Pakistan Cricketer Hasan Ali On IPL :అంతర్జాతీయ స్థాయిలో టీ20 క్రికెట్‌కు గ్లామర్ తీసుకొచ్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్- ఐపీఎల్. అభిమానులకు వినోదాన్ని అందిస్తూ.. ప్లేయర్లకూ ఆర్థిక దన్నుగా నిలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీలో ఆడేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్లేయర్లు ఆసక్తి చూపిస్తారు. ఐపీఎల్ వేలంలో తమను ఏ జట్టు అయినా కొనుగోలు చేయాలని కోరుకుంటారు. అందుకేనేమో ఐపీఎల్‌పై మనసు పారేసుకున్నాడు పాకిస్థాన్‌కు చెందిన ప్లేయర్ హసన్ అలీ. తనకు అవకాశమొస్తే ఈ టోర్నీలో ఆడతానని తెలిపాడు.
"ప్రపంచంలో ప్రతి క్రికెటర్ ఐపీఎల్‌లో ఆడాలని కోరుకుంటాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 క్రికెట్ లీగ్. నాకు కూడా ఐపీఎల్‌లో ఆడాలని ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో అవకాశం వస్తే ఐపీఎల్‌లో కచ్చితంగా ఆడతా"
--హసన్ అలీ, పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్
ఐపీఎల్‌కు పాక్ ప్లేయర్లు దూరం- కారణమిదే!
పాకిస్థాన్ ప్లేయర్లు ఐపీఎల్‌లో ఆడకపోవడానికి కారణం ఉంది. 2008లో జరిగి ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు షోయబ్ మాలిక్, షోయబ్ అక్తర్, కమ్రాన్ అక్మల్, సోహైల్ తన్వీర్, షాహిద్ అఫ్రిది పాల్గొన్నారు. కానీ 2009లో ముంబయిలో జరిగిన ఉగ్రదాడుల కారణంగా ఆ దేశ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఎంట్రీపై నిషేధం విధించారు. అయితే ఆ తర్వాత పాక్ క్రికెటర్ అజహర్ మహ్మద్ బ్రిటీష్ పౌరసత్వం తీసుకుని ఐపీఎల్ ఆడాడు. రాబోయే ఐపీఎల్‌లో ఇటీవలే బ్రిటీష్ పౌరసత్వం పొందిన పాకిస్థాన్ మాజీ బౌలర్ మహ్మద్ అమీర్ కూడా ఐపీఎల్‌లో ఆడే ఆవకాశం ఉంది.