పాకిస్థాన్‌లో ఆసియా కప్ ఆడబోమంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలపై ఆ దేశం స్పందించింది. భారత్‌లో జరిగే వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనకూడదనే ప్రతిపాదనను పాకిస్థాన్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా పరిశీలిస్తున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం వ్యవహారంపై జైషా అధ్యక్షుడిగా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఘాటు లేఖ పంపాలని రమీజ్‌రాజా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అత్యవసర సమావేశం జరిపి చర్చించాలని డిమాండ్ చేయనున్నట్లు సమాచారం.
జై షా అధ్యక్షుడిగా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)కు లేఖ రాయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏసీసీ నుంచి బయటకు వచ్చే అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ కఠినంగా స్పందించాల్సిన సమయం వచ్చిందని.. ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో భారత్ ఆడకపోతే వాణిజ్య పరంగా తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పీసీబీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
పాక్‌లో ఆసియాకప్ నిర్వహణకు దాదాపు ఏడాది సమయం ఉండగానే జైషా ఈ ప్రకటన చేయడంపై పీసీబీ అధికారులు ఒకింత ఆశ్చర్యపోయారు. పాక్ వెటరన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ఈ వ్యవహారంపై ట్విటర్‌లో స్పందించాడు. జైషాలో అనుభవరాహిత్యం కనిపిస్తోందని తప్పుబట్టాడు. ప్రపంచకప్ మ్యాచ్‌కు మందు బీసీసీఐ కార్యదర్శి ఇటువంటి ప్రకటన ఎందుకు చేశారని ప్రశ్నించారు.