ODI World Cup India Pakisthan: వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్ తాము ఆడబోమంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో ఇరు దేశాల మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వివాదంపై ఇప్పటికే పాక్ మాజీ క్రికెటర్ల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే బీసీసీఐ నిర్ణయం తర్వాత పీసీబీ ఒక లేఖ విడుదల చేసింది. భారత్‌లో జరిగే వన్డే ప్రపంచ కప్ నుంచి తాము వైదొలగుతామని బెదిరించింది.
అయితే ఈ విషయమై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ కోసం భారత్.. పాకిస్థాన్‌కు వెళ్లదని, వన్డే ప్రపంచకప్ ఆడేందుకు పాకిస్థాన్ మాత్రం కచ్చితంగా భారత్‌కు వస్తుందని చెప్పాడు. అందుకు తాను రాసి ఇవ్వగలనని పేర్కొన్నాడు.