PAK Vs SA World Cup 2023 :2023 వరల్డ్ కప్‌లో అనూహ్య ఫలితాలను సాధిస్తున్న ఓ రెండు జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఓ వైపు హ్యాట్రిక్ ఓటములతో టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన పాకిస్థాన్ జట్టు డీలాపడగా.. భారీ విజయాలతో దూసుకుపోతున్న దక్షిణాఫ్రికా ఇప్పుడు టాప్ పొజిషన్‌ను అందుకునేందుకు కసిగా ప్రయత్నిస్తోంది. చెన్నై వేదికగా నేడు ( అక్టోబర్ 27) పాకిస్థాన్ - దక్షిణాఫ్రికా జట్లు పోటీపడేందుకు సిద్ధమయ్యాయి. అఫ్గాన్ చేతిలో ఓటమి తర్వాత తీవ్ర విమర్శలకు గురైన పాక్.. ఆ చిక్కుల నుంచి బయటపడేందుకు ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలని ఆశపడుతోంది. అంతే కాకుండా సెమీస్‌లో ఎంటర్ అయ్యే అవకాశాన్ని దక్కించుకునేందుకు కృషి చేస్తోంది. మరోవైపు ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా.. మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దక్షిణాఫ్రికా చాలా పటిష్ఠంగా ఉంది. మార్‌క్రమ్, డికాక్, క్లాసెన్, మిల్లర్ లాంటి ప్లేయర్లు అద్భుతమైన ఫామ్‌తో భారీ ఇన్నింగ్స్‌లు ఆడేస్తున్నారు. ఇక ఈ వరల్డ్ కప్‌లో మూడు సెంచరీలతో డికాక్ దూసుకుపోతున్నాడు. మరోవైపు బౌలింగ్‌లోనూ కొయిట్జీ, రబాడ, కేశవ మహరాజ్, మార్కో జాన్‌సెన్ తమ బౌలింగ్ స్కిల్స్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు.
ఆ ఫార్ములా వల్లే..
ఈ ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఉపయోగిస్తున్న ఫార్ములా ఒక్కటే. తొలుత బ్యాటింగ్‌కు దిగి భారీగా పరుగులు చేయడం.. ఆ తర్వాత భారీ స్కోర్‌తో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచడం. గత నాలుగు మ్యాచుల్లో దక్షిణాఫ్రికా ఇలానే గెలుస్తోంది. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఉపయోగిస్తే.. పాక్‌పైనా సఫారీ జట్టు విజయం సాధించడం ఖాయం. ఇప్పటికే మూడు ఓటములతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాక్ జట్టు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఆ జట్టు ఒత్తిడిని అధిగమించి రాణించడం అనేది పెను సవాలే. బ్యాటింగ్ విభాగంలో రిజ్వాన్, బాబర్, షకీల్, ఇఫ్తికార్, అబ్దుల్లా మంచి ఫామ్‌లోనే ఉన్నారు. కానీ, ఇఫ్తికార్ తప్ప మిగతా ఎవరూ కూడా దూకుడైన ఆటతీరును కనబరచటం లేదు.
మరోవైపు పాక్ బౌలింగ్ యూనిట్ కూడా అంతగా రాణించలేకపోతోంది. దీంతో షహీన్ ఒక్కడిపైనే అదనపు భారం పడింది. హారిస్ రవూఫ్ కూడా అప్పుడప్పుడు వికెట్లు తీస్తున్నప్పటికీ భారీగా పరుగులు సమర్పించేస్తున్నాడు. ఇక స్పిన్నర్ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని విశ్లేషకుల మాట.