Pak Vs Ban Asia Cup 2023 : ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన సూపర్-4 తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. మొదట హారిస్ రవూఫ్‌తో పాటు నసీమ్ షా విజృంభించినప్పటికీ బంగ్లా 38.4 ఓవర్లలో 193 పరుగులకే కుప్పకూలింది. ముష్ఫికర్ రహీమ్, షకిబ్ అల్‌హసన్ తప్ప బంగ్లా బ్యాటర్లు ఎవరూ అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేదు. దీంతో ఆ జట్టు ఓటమి దాదాపు ఖరారైంది.
మరోవైపు బంగ్లా నిర్దేశించిన లక్ష్యాన్ని పాక్.. 39.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇమాముల్ హక్ ఛేదనలో పాక్‌కు బలమైన పునాది పడగా.. రిజ్వాన్ కూడా తనదైన శైలిలో ఆడి జట్టును విజయపథంలోకి నడిపించాడు. ఇక శనివారం జరగనున్న తర్వాతి సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకను బంగ్లా ఢీకొట్టనుంది.
Pakistan Vs Bangladesh : మొదట నుంచి బంగ్లా ఇన్నింగ్స్ కాస్త నాటకీయంగానే సాగింది. ఆ జట్టుకు దక్కిన ఆరంభం చూస్తే 150 అయినా చేస్తుందా..? లేదా అని అనిపించింది. అయితే మధ్యలో వేగం పుంజుకున్న ఆ జట్టు 250 దాటేలాగే కనిపించింది. కానీ చివరికి 193 పరుగులకే ఔటైంది. హారిస్ రవూఫ్‌తో పాటు నసీమ్ షా, షహీన్ అఫ్రిది (1/42) సైతం కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల బంగ్లా ఒక దశలో 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే గత మ్యాచ్ సెంచరీ హీరో మిరాజ్ డకౌటై వెనుదిరగా.. నయీమ్ (20), లిటన్ (16) మంచి ఆరంభాలను వృథా చేసుకున్నారు.